రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

రేపే డిశ్చార్జి.. పాత ఇంటికి కేసీఆర్‌

Published Thu, Dec 14 2023 2:51 PM

KCR Likely Discharge Dec 15 Shift to Old House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. తుంటి ఎముక విరగడంతో నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరిన ఆయనకు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఆయన్ని వైద్యులు ఇంటికి పంపించనున్నారు. ఆపై ఆయన నేరుగా బంజారాహిల్స్‌ నందినినగర్‌లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. 

తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రగతి భవన్‌ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు షిఫ్ట్‌ అయ్యారాయన. ఈ క్రమంలో గత గురువారం రాత్రి బాత్రూంలో జారి కిందపడడంతో తుంటి ఎముక రెండుచోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన నగరంలోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం వివిధ పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించింది. ఆపై విజయవంతంగా సర్జరీ చేసింది. అప్పటి నుంచి ఆయన కోలుకుంటూ వస్తుండగా.. ప్రముఖుల పరామర్శ కొనసాగుతోంది. 

ఈ క్రమంలో  కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు నందినినగర్‌లోని కేసీఆర్‌ ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు.

 
Advertisement
 
Advertisement