తెలంగాణ  ‘కరెంటా’భరణం.. కేసీఆర్‌ !

KCR Fight For Current - Sakshi

సినీ సంగీత ప్రపంచంలో శంకరాభరణం శంకరశాస్త్రి ఎంతటి మహనీయుడో..ఉద్యమ ప్రపంచంలో అంతటి గౌరవనీయుడు కేసీఆర్‌. సంగీత సాధనలో శంకరశాస్త్రి గొప్ప అయితే..తెలంగాణ సాధనలో కేసీఆర్‌ గొప్ప.  తెలంగాణలో 24 గంటలు నిర్విరామ కరెంట్‌ అనేది నిర్వివాదంగా చెప్పుకోవాల్సిన విషయం.

కేసీఆర్‌ ఎప్పుడూ తన పల్లె పలుకుబడులూ, ప్రజా నానుడులూ, సామెతలతో విషయాన్ని విపులంగా మారుమూల పల్లె ముసలమ్మకైనా అర్థమయ్యేలా చెప్పగలడు. కానీ శంకరశాస్త్రి అభిమానుల్లాంటి  శిష్ట క్లాసికల్‌ జనానికి అర్థమయ్యేలా చెప్పాలన్నది కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సంకల్పం. అందుకే ‘కరెంట్‌’ అనే కాన్సెప్టుతోకొన్నిసంగతులు అర్బన్‌ ఆడియెన్స్‌కు అర్థమయ్యేలా చెప్పాలని రాసుకున్న కొన్ని సీన్స్‌ ఇవి...

కేసీఆర్‌ హుందాగా తన గుర్తునూ..ప్రచార నినాదాన్ని ఇలా రూపొందించుకుంటాడు. ఆ సంగీత ప్రపంచపు పెద్దమనిషిలాగే..ఈయన నినాదగానం ఇలా ఉంటుంది...  ‘‘ఓ ‘కారు’ చిహ్నమ్ము  సంధానమౌ పార్టీయే.. బీఆర్‌ఎస్‌ పార్టీనే..మన బీఆర్‌ఎస్‌ పార్టీయే’’ అంటూ క్లాసికల్‌ క్లాస్‌ ఆడియెన్స్‌క్కూడా నాటుకునేలా చెబుతాడు.   ‘కరెంటు మూడుగంటల పాటు చాలు’..అంటూ ఓ కాంగ్రెసు వ్యక్తి చేసిన వ్యాఖ్యానం కేసీఆర్‌ను ఎంతో బాధపెడుతుంది.

అప్పుడాయన ఇలా ఉద్బోధ చేస్తాడు.  ‘‘చూడండి కాంగ్రెస్సు వారూ...  తొట్టెలో ఉన్న బుడుతడు తన హాయి నిద్ర కోసం 24 గంటల కరెంటడుగుతాడు.   పేషెంటయిన ఓ పెద్దాయన తన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ కోసం ఇంకో రకంగా కరెంటడుగుతాడు.  చేనుకు నీళ్లు పెట్టాలనుకున్న బక్క రైతు రాత్రి పురుగూ, పుట్రా ముట్టకుండా పవిత్రమైన కరెంటును పట్టపగలే అడుగుతాడు.  కేంద్రంలోని కొందరు పెద్దలు  కరెంటుకు మీటర్లు పెట్టాలంటారు.

ఇలా..ఒక్కొక్కరి కరెంటుకు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్పసుంటుందీ..ప్రయోజనముంటుంది.  అందరికీ అవసరమైన ఈ కరెంటును మూడుగంటలు చాలంటూ మిడిమిడిజ్ఞానంతో ముక్కలుగా విరిచేసి రాష్ట్రాన్ని అంధకారం చేయకు కాంగ్రెస్సూ!  తాదాత్మం చెందిన నీటిప్రవాహపు లోతుల్లోంచి పెల్లుబికిన పవిత్ర హైడల్‌ కరెంటులాంటి విద్యుత్‌ గురించి ఇలాంటి అపభ్రంశపు మాటలు మాట్లాడకు దాసూ!!’’ అంటూ హితబోధ చేస్తాడు కేసీఆర్‌.

‘‘సార్‌.. మీరు చెప్పినదంతా అర్థమైందిగానీ..‘పవిత్రమైన కరెంటు’ ఏమిటి సార్‌?’’ అడిగాడో రాజకీయశిష్యుడు. అంతే..ఆయనలో మనసు మూలలనిండా నిండిపోయున్న పల్లెపదాల పదకోశ భండాగారాల్లోంచి... ‘అటజనిగాంచె’నంటూ,  ‘కాటుక కంటినీరం’టూ..అప్పుడప్పుడు మాత్రమే  వెలువడే పండితవాక్కులు మరోసారి వెలువడ్డాయి.

ఇలా... ‘‘చూడండి కార్యకర్తలూ..‘పృథ్వా్యపస్తేజోవాయురాకాశః’ అనే ఆ పవిత్ర పంచభూతాల్లో ఒకటైన నీటి నుంచీ..ఈ నీరు టర్బనాంతర్గత భ్రమణకల్లోల్లాల్లోంచి, ఆ జలజీవన స్రవంతిలోంచి..ఈ జనజీవన స్రవంతిలోకొచ్చే ఈ కరెంటు పవిత్రమైనది కాకుండా ఎలా ఉంటుంది నాయనా’’ అంటూనే...  

‘‘ఈ కరెంటు సప్లైని ఓ కాపుగాయడానికి ఓట్లు అందించే ఓటరులందరికీ శత సహస్ర వందనాలు. ఇలాంటి ఓటరులంతా ఓటేసినంతకాలం ఈ కరెంటుధార సప్లై అసిధారావ్రతంలా ఇలా అనంతంగా సాగిపోతూనే ఉంటుంది’’ అంటూ ఉండగానే...  

‘‘అయ్యో... మేమా వ్యాఖ్య చేయనేలేదు. ఇదంతా మీడియా వక్రీకరణ. మేమూ కట్టుబడి ఉన్నాం ఐదుగంటల కరెంటుకు’’ అంటూ ‘కరెంటు’షాక్‌కొట్టినట్లుగా గగ్గోలుపెడుతూ నష్ట నివారణ చర్యలకు పూనుకున్నారు కాంగ్రెస్‌వారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top