బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌లో సీఎం మార్పు అంశానికి దాదాపు తెరపడినట్లే కనిపించినా, అక్కడక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను అభిమానించే గణం మాత్రం తమ వాయిస్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ‘డీకే.. డీకే’ అంటూ పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద పెద్దగా అరుపులు అరవడం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు విపరీతమైన కోపం తెప్పించింది. అది కూడా తాను పాల్గొన్న ర్యాలీలో ఇలా అరవడం ఏంటనే చిరాకు సిద్ధరామయ్యలో కనిపించింది. ‘ఎవరు డీకే.. డీకే అరుస్తుంది.. నెమ్మదిగా ఉండలేరా.. కామ్‌గా ఉండండి’ అంటూ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు సిద్ధరామయ్యా.
వివరాల్లోకి వెళితే.. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి పథకం "వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కర్ణాటక కాంగ్రెస్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు ఓ ర్యాలీ ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఇందులో సిద్ధరామయ్యతో పాటు శివకుమార్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అయితే దీనిలో భాగంగా వేదిక వద్దకు సిద్ధరామయ్య నడుచుకుంటూ వెళుతున్న సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు డీకే.. డీకే అంటూ పెద్ద పెద్దగా అరవడం ప్రారంభించారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సిద్ధరామయ్య.. ఎవరు.. డీకే డీకే అంటూ అరిచేది.. అరవ కుండా ఉండలేరా. అంతా సైలెంట్‌గా ఉండండి’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత సిద్ధరామయ్య ప్రసంగించే సమయంలో కూడా డీకే నాదమే వినిపించడంతో సిద్ధరామయ్యకు మరింత కోపం తెప్పించింది. కాకపోతే చేసేది లేక అలాగే ప్రసంగించారు సిద్ధరామయ్య.


