
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కరేడు గ్రామ రైతులు కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. మీ పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అవసరమైతే గ్రామానికి కూడా వస్తానని జగన్ చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ మాట్లాడుతూ.. కరేడులో భూసేకరణ వెనుక పెద్ద కుట్రలు ఉన్నాయన్నారు. ఆల్రెడీ ఇండోసోల్‌కు భూములు తీసుకుని మళ్ళీ భూసేకరణ ఎందుకు? అంటూ ఆయన ప్రశ్నించారు. ‘‘పచ్చని పంటపొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోం. వైఎస్ జగన్‌ని కలిసి ప్రభుత్వ కుట్రలను వివరించాం. ఇండోసోల్ కి ఆల్రెడీ భూములు ఎలాట్ చేసి ఇప్పుడు మరోచోట ఇస్తామంటూ భూములు సేకరించటం కరెక్ట్ కాదని మధుసూదన యాదవ్ అన్నారు.
కరేడు గ్రామ రైతు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ.. మా రైతుల సమస్యలను వైఎస్ జగన్‌కి వివరించాం. మాకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ మా గ్రామానికి వస్తానన్నారు. మా ప్రాణామైనా ఇస్తాం.. కానీ ప్రభుత్వానికి మా భూములు ఇవ్వం. పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇండోసోల్ పేరుతో భూ వ్యాపారం చేస్తామంటే సహించం. సెంటు భూమి కూడా ఈ ప్రభుత్వానికి ఇచ్చేదిలేదు

ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ.. ‘‘మా హయాంలో రామాయపట్నం పోర్టు తెచ్చినప్పుడు ఒక్క సమస్య కూడా రాలేదు. బాధితులకు నచ్చచెప్పి పునరావాసం కల్పించాం. ఇండోసోల్ పరిశ్రమ ఏర్పాటు కావాల్సిన భూములు కూడా ఇచ్చాం. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేసింది. ఇండోసోల్‌ను బలవంతంగా మరో చోటకు తరలించాలని చూస్తోంది. కరేడులో అన్ని రకాల పంటలు పండుతాయి.

..సంవత్సరం పొడవునా పంటలు పండే గ్రామం అది. రెండున్నర వేల మత్స్యకార కుటుంబాలను ఖాళీ చేయించాలని చూస్తున్నారు. ఎస్టీలంతా గ్రామంలోని పొలాల్లో పనులు చేసుకుని బతుకుతారు. వారిని కూడా వెళ్లగొట్టాలని చూస్తున్నారు. కరేడులో 18 వేల మంది ఉన్నారు. వారందరినీ రోడ్డున పడేయాలని చూడటం కరెక్ట్ కాదు. సముద్రం ఒడ్డున 30కిమీ వరకు భూములు లాక్కునే కుట్రలు జరుగుతున్నాయి. అనేక గ్రామాలను కబళించడానికి ప్రయత్నం చేస్తున్నారు’’ అని మాధవరావు మండిపడ్డారు.