ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం: కాకాణి | Kakani Govardhan Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

ఉచిత ఇసుక పథకం పచ్చి బూటకం: కాకాణి

Jan 27 2026 1:30 PM | Updated on Jan 27 2026 1:48 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu Government

సాక్షి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ఉచిత ఇసుక హామీ పెద్ద బూటకమని, ఆ పేరుతో కూటమి నాయకులు సహజ వనరులను దోచుకుని జేబులు నింపుకుంటున్నారని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా 5 రెట్లకు పైగా అధిక ధరలు వసూలు చేస్తూ ఒక్కో ఇసుక రీచ్‌ నుంచి కూటమి ఎమ్మెల్యేలు నెలకు రూ.3 కోట్లకు పైగా దోచుకుంటున్నారని ఆరోపించారు.

సూరాయపాలెం ఇసుక రీచ్‌పై సమగ్ర పరిశీలన తర్వాతే మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. నిబంధనలను బేఖాతర్‌ చేస్తూ విరివూరు ఇసుక రీచ్‌లో అర్ధరాత్రి, వేకువ జామున ఇసుక తవ్వి తరలిస్తున్న ఫొటోలను ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రదర్శించారు. ఇసుక అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఎలా దోచేస్తున్నదీ ఆయన వివరించారు.

సీఎం చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇలాంటి వారికి బేడీలు వేసి నడిరోడ్డుపై నడిపించి తీసుకెళ్లాలని కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇసుకను అక్రమంగా దోచుకుంటున్న వారు దొరికితే అరెస్ట్‌ చేసి శిక్షించాల్సిన పోలీసులు మంత్రి పర్మిషన్‌ అడగడం ఏమిటని మండిపడ్డారు. పైగా కూటమి నాయకుల ఇసుక దందాను బయటపెట్టడానికి వెళ్తుంటే  పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటే కూటమి నాయకుల దందాకు కలెక్టర్, ఎస్పీ లైసెన్స్‌ ఇచ్చినట్లుగా ఉందని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

పెన్నా నదికి గర్భశోకం:
అధికార పార్టీ నాయకుల ధన దాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. నెల్లూరులో పెన్నా నదీ గర్భం శోకంతో అల్లాడిపోతుంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారు. నదీగర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీలతో తరలిస్తున్నారు. పగలూ రాత్రీ తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీలతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

సెమీ మెకనైజ్డ్‌ రీచ్‌లకు పొక్లెయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఐదు రెట్లు అధిక ధరలకు ఇసుకను అమ్మేసుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక టెండర్లు నిర్వహించి ఏడాదికి రూ.700 కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.3500 కోట్ల ఆదాయం తీసుకొస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత ఇసుక పేరుతో ఆ మొత్తాన్ని కూటమి నాయకులు దోచుకుంటున్నారు.

Kakani : అర్థరాత్రి ఏంటీ పని పెన్నా నదిలో పగలూ రాత్రి దోపిడీ

రాత్రింబవళ్లూ ఇసుక దోపిడీ:
ఒక్క సూరాయపాలెం ఇసుక రీచ్‌ ద్వారానే ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ.100 కోట్లు దోపిడీకి స్కెచ్‌ వేశారని గతంలో నేను ఆరోపిస్తే, ఆయన తోసిపుచ్చారు. కానీ, ఆయన ఇప్పుడు ఏకంగా సాయి శ్రీనివాస్‌ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌కి వెళ్లేలా క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేసి నేరుగా కోట్లు కొల్లగొడుతున్నారు. ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్‌ షీట్‌ పేరుతో చేత్తో రాసిన స్లిప్‌ చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులు లోడ్‌తో వెళ్లే ఒక ట్రాక్టర్‌కి టన్నుకి రూ.68 చొప్పున రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉంటే ఐదు రెట్లు అధికంగా రూ.1,250 వసూలు చేస్తున్నాడు. పైగా ఉ. 6 గం. నుంచి సా. 6 గం. మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ రేయింబవళ్లు పొక్లెయినర్లతో తోడేస్తున్నారు. (అంటూ.. పెన్నా నదిలో విరువూరు ఇసుక రీచ్‌లో వేకువజామున, అర్ధరాత్రి వేళల్లో ఇసుక తవ్వుతున్న ఫొటోలు ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు).

ఓపెన్‌ రీచ్‌లలో ఏకంగా రైతులకు సాగు నీరు వెళ్లే కాలువలకు అడ్డంగా గట్టు కట్టి మరీ గ్రావెల్‌తో రోడ్డేసి ఇసుక లారీలను రప్పిస్తున్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) ఆదేశాలను బేఖాతరు చేసి మరీ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలతో ఏర్పడిన గుంతల్లో పడి అమాయకుల ప్రాణాలు పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చంద్రబాబు నాయుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇసుక దోపిడీకి పాల్పడుతున్న వారిని నడిరోడ్డు మీద బేడీలు వేసి నడిపించాలి.

ఐదు రెట్లకు మించి అధిక ధరలు:
సూరాయపాలెం ఇసుక రీచ్‌ను కేస్‌ స్టడీగా తీసుకుని తెలుగుదేశం నాయకుల ఇసుక దోపిడీపై మేం కూలంకషంగా స్టడీ చేశాం. ఇసుక రీచ్‌ మీద నెలకు ఏకంగా రూ.3 కోట్లు దోచేస్తున్నారు. రూ.1400 వసూలు చేయాల్సిన టిప్పర్‌కి ఏకంగా రూ.8 వేలు వసూలు చేస్తున్నారు. 12 టైర్ల లారీకి రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు, 14 టైర్ల లారీకి రూ.2024 వసూలు చేయాల్సి ఉంటే రూ.15 వేలు వసూలు చేస్తున్నారు.

ఇసుక దోపిడీదారులకు పోలీసుల రక్షణ!:
కూటమి నాయకుల ఇసుక దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఈ ఇసుక దోపిడీని పోలీసులు తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెబుతూ నిందితులపై చర్యలు తీసుకోమని ఆదేశించకుండా, రాత్రుళ్లు టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారు. (అంటూ.. మంత్రి మాటల ఆడియోను ప్రెస్‌మీట్‌లో వినిపించారు)

ఇసుక దొంగలు చేతికి దొరికితే వారిని అరెస్ట్‌ చేయకుండా మంత్రి నారాయణ సలహా అడగడం చూస్తుంటే పోలీసులు ఎవరి కోసం పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు న్యాయబద్ధంగా నిబంధనల మేరకు వ్యవహరించడం లేదు. కూటమి నాయకుల ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికి వైఎస్సార్‌సీపీ ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే, కూటమి నాయకుల ఇసుక దోపిడీకి కలెక్టర్, ఎస్పీలు లైసెన్స్‌ ఇచ్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement