సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ఒక వైపు పంటల కొనుగోలు లేక, మరోవైపు లేని కనీస మద్దతు ధర వల్ల రైతులు కుదేలవుతున్నారని, ఇంకా ఎక్కడిక్కడ ధాన్యం కళ్లాల్లోనే ఉందని, దీంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కైలే అనిల్‌కుమార్ వెల్లడించారు. గత 10 రోజులుగా రైతుల సమస్యల పట్ల మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నా, అటు వైపు నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదని ఆయన ఆక్షేపించారు.
కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా మారిందని చెప్పారు. వ్యవసాయంపై చంద్రబాబు, ఎన్నికల ముందు ఒకలా, ఆ తర్వాత మరోలా మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు రైతులు కష్టాలు పడుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ తెలిపారు. ఏం మాట్లాడారంటే..:
సంక్షోభంలో వ్యవసాయ రంగం:
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండగలా సాగింది. విత్తనాలు మొదలు పంటల అమ్మకం వరకు ప్రతి గ్రామంలో రైతుల చేయి పట్టుకుని నడిపించాయి నాటి రైతు భరోసా కేంద్రాలు. వాటిని జగన్ ఏర్పాటు చేశారన్న అక్కసుతోనే, ఇప్పుడు ఆ వ్యసవ్థను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. దీంతో విత్తనాలతో పాటు, యూరియా కోసం కూడా రైతుల క్యూ కట్టక తప్పడం లేదు. యూరియాను బ్లాక్ మార్కెట్‌లో కొనకా తప్పడం లేదు.
చివరకు పంటలు అమ్ముకోవడానికి కూడా ఇప్పుడు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఏ ఒక్క పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదు. చాలా చోట్ల ధాన్యం కళ్ళాల్లోనే ఆరబోసి ఉండగా, వరస తుపాన్లు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు ప్రభుత్వం నుంచి ఏ విధంగానూ అండ లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు లేకపోవడం, కనీస గిట్టుబాటు ధర కూడా రాకపోవడం.. ఇవన్నీ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేశాయి.
కళ్ళాల్లోనే ధాన్యం. లేని కొనుగోళ్లు:
రాష్ట్రంలో ఎక్కడికక్కడ కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోయింది. ఇంకా చాలా చోట్ల రోడ్లపైనా ధాన్యం రాసులే ఉన్నాయి. మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి «10 రోజులుగా, ధాన్యం రాసులు పోసి ఉండగా, ఓ మంత్రి అటుగా వెళ్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, వాటిని అక్కడి నుంచి తీసేయాలని ఆదేశించారు. ఒకవైపు ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం, మరోవైపు రైతులను ఆ విధంగా కూడా ఇబ్బంది పెడుతోంది.
మొంథా తుపాన్‌తో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటామనే దానిపై ఇప్పటి వరకు అటు కేంద్రం నుంచి కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఒక్క ప్రకటన కూడా రాలేదు. తుపాన్ తర్వాత కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చినా, రైతుల కష్టాలు కొంత వరకైనా తీరేవి. కానీ, కూటమి ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీకి పూర్తిగా మంగళం పాడింది.
దారుణంగా పడిపోయిన ధరలు:
మా పామర్రు నియోజకవర్గంలో 75 కేజీల బస్తా ధాన్యాన్ని కనీసం రూ.1000కి కూడా కొనుగోలు చేయని దుస్థితి నెలకొంది. తేమ పేరుతో తూకం తగ్గిస్తున్నారు. అలా ఒక్కోసారి 75 కేజీల బస్తాల్లో 12 కేజీల వరకు తీసేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో వ్యాపారులు, దళారులదే రాజ్యంగా మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో, ధాన్యం కొనుగోళ్లలో ఆర్బీకేలు పని చేయడం వల్ల, ఏనాడూ రైతులు ఇలా ఇబ్బంది పడలేదు.
ఇప్పుడు మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, చీనీ, మామిడి ఇలా దేనికీ మద్దతు ధర ఇచ్చిన పరిస్ధితి లేదు. అరటి అయితే మరీ దారుణంగా కేజీ కనీసం 50 పైసలు కూడా పలకడం లేదు. ఇకనైనా ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని కైలే అనిల్‌కుమార్ కోరారు. అలాగే రైతుల సమస్యలపై నోరెత్తితే, కక్ష సాధింపు చర్యలు విడనాడి, వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మాజీ ఎమ్మెల్యే తేల్చి చెప్పారు.


