ఎన్నికల వేళ.. పవన్‌ సంపద సృష్టి | Sakshi
Sakshi News home page

ఎన్నికల వేళ.. పవన్‌ సంపద సృష్టి

Published Wed, Apr 24 2024 5:28 AM

Janasena Leader Pawan Kalyan Assets in Election Affidavit - Sakshi

దాదాపు రూ.25 కోట్లతో హైదరాబాద్, మంగళగిరిలో ఇల్లు, ఇంటి స్థలం కొనుగోలు 

మొన్న మార్చి 4నే రూ.16.14 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు.. 

ఫిబ్రవరిలో మంగళగిరిలో రూ.7.11 కోట్లతో ఇంటి స్థలం 

10% పైగా ఆస్తులు ఎన్నికలకు 2 నెలల ముందు కొన్నవే 

ఎన్నికల అఫిడవిట్‌లో పవన్‌కళ్యాణ్‌ 

సాక్షి, అమరావతి: సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ హైదరాబాద్, మంగళగిరిలో దాదాపు రూ.25 కోట్ల ఆస్తులను కొనుగోలు చేశారు. ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేస్తున్న ఆయన మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా తన వ్యక్తిగత, కుటుంబ సభ్యుల ఆదాయ, ఆస్తుల వివరాలను అఫిడవిట్‌ రూపంలో ఎన్నికల సంఘానికి సమర్పించారు.

అందులో ఆయన నెలన్నర క్రితం 2024 మార్చి 4న రూ.16.14 కోట్లతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో 1,060 చదరపు గజాల స్థలంలో 15,709 చదరపు అడుగుల్లో ఉన్న ఇంటిని కోనుగోలు చేసినట్లు చూపగా.. 2024 ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో మంగళగిరి పట్టణ పరిధిలోని 5,517.6 చదరపు గజాల స్థలం కొనుగోలు చేసినట్లు పవన్‌ అందులో పేర్కొన్నారు. అంతేకాక.. వ్యక్తిగతంగా తన పేరిట రూ. 209.13 కోట్లు స్థిర చరాస్తులుగానూ, రూ.65.76 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన భార్య అన్నా లెజినోవా, అఫిడవిట్‌లో పేర్కొన్న నలుగురు పిల్లల పేరిట మరో రూ.28.47 కోట్ల స్థిర చరాస్తులు ఉన్నట్లు పవన్‌ పేర్కొన్నారు. ఇక మొత్తం ఆస్తుల్లో 10 శాతానికి పైగా ఆస్తులు ఎన్నికలకు రెండు నెలల ముందు కొనడం గమనార్హం.  

ఆ పిల్లలకు ఒక రకంగా.. ఈ పిల్లలకు మరో రకంగా.. 
ఇదిలా ఉంటే.. అఫిడవిట్‌లో పవన్‌ తన పిల్లలు దేశాయి అకీరా నందన్, దేశాయి ఆద్య (వీరిద్దరూ రేణుదేశాయి–పవన్‌కళ్యాణ్‌ పిల్లలు)తో పాటు పోలీనా అంజని, మార్క్‌ శంకర్‌ (పవన్‌కళ్యాణ్‌–అన్నా లెజినోవా పిల్లలు) పేర్లతో ఉన్న ఆస్తులూ వెల్లడించారు. ఆ అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. వీరికి ఆస్తుల కేటాయింపులో పవన్‌   వ్యత్యాసం చూపించారు. విడాకులిచ్చిన రేణుదేశాయి పిల్లలకు ఒక రకంగా, ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకున్న లెజినోవా పిల్లలకు మరో రకంగా వారి పేరిట తన ఆస్తులు బహుమతుల రూపంలో ఇవ్వడం గమనార్హం.   

చదివింది పదో తరగతే.. 
ఇక పవన్‌ పదో తరగతి వరకే చదువుకున్నారు. అది కూడా ఎస్‌ఎస్‌ఎల్‌సీ (సెకండరీ స్కూల్‌ లీవింగ్‌ సర్టిఫికెట్‌) రద్దయి, దాని స్థానంలో ఎస్‌ఎస్‌సీ (సెకండరీ స్కూల్‌ సర్టిఫికెట్‌) వచ్చిన చాలా ఏళ్ల తర్వాత ఎస్‌ఎస్‌ఎల్‌సీ చదవడం గమనార్హం. ఇంటర్‌లో మేథమేటిక్స్‌ మొదలు ఎకనామిక్స్‌ వరకు దాదాపు అరడజను సబ్జెక్టులు చదివినట్లు సందర్భాన్ని బట్టి చెప్పే పవన్‌.. అవన్నీ హంబక్‌ అని అఫిడవిట్‌లో కుండబద్దలు కొట్టారు. 1984లో నెల్లూరులోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో టెన్త్‌ ఉత్తీర్ణులైనట్లు అఫిడవిట్‌లో వివరించారు.  తనపై మొత్తం 8 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొనగా.. తన ప్రస్తుత చిరునామా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీగా చెబుతూ.. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోని 197 పోలింగ్‌ బూత్‌ 1120 నెంబరుగా తనకు ఓటు ఉన్నట్లు తెలిపారు.  

పవన్, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు.. 
2018–19 ఆర్థిక సంవత్సరంలో తనకెలాంటి ఆదాయం లేకపోగా, రూ.1,10,62,939 నష్టం వచ్చిందని.. అయితే, 2019–20లో రూ.4.51 కోట్లు, 2020–21లో రూ.12.86 కోట్లు, 2021–22లో 30.09 కోట్లు, 2022–23 ఆర్థిక ఏడాదిలో 12.20 కోట్లు మాత్రమే తన ఆదాయంగా ఆదాయపన్ను శాఖకు సమర్పించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే, తన భార్య, పిల్లల ఆదాయాలకు సంబంధించి ఎలాంటి ఐటీ రిటరŠన్స్‌ వివరాలు లేవు.   

చరాస్తులు.. 
► పవన్‌కళ్యాణ్‌ చేతిలో ఈ ఏడాది ఏప్రిల్‌ 19 నాటికి తన చేతిలో నగదు రూపంలో రూ.3.15 లక్షలు ఉన్నాయని.. బ్యాంకుల్లో డిపాజిట్లుగా రూ.16.48 కోట్లు.. షేర్లు, బాండ్ల రూపంలో రూ.15.48 లక్షలు.. ఇన్సూరెన్స్‌ తదితర పెట్టుబడులుగా మరో రూ.3.02 కోట్లు.. ఇతరులకు అప్పు రూపంలో ఇచ్చిన మొత్తం రూ.3.65 కోట్లు.. అలాగే, రూ.14.01 కోట్లు విలువ చేసే కార్లు, వాహనాలున్నాయని.. రూ.2.34 కోట్ల బంగారు ఆభరణాలు.. రూ.14.51 లక్షల విలువ చేసే వెండి ఆభరణాలు.. ఇతర రూపాల్లో మరో రూ.1.79 కోట్లు కలిపి మొత్తం చర ఆస్తుల రూపంలో రూ.41.65 కోట్లుగా చూపించారు.  

► తన వద్ద రూ.32 లక్షల విలువ చేసే హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌తో పాటు పది కార్లు (రెండు బెంజి, మూడు మహీంద్రా స్కార్పియాలు, రేంజ్‌ రోవ­ర్, రెండు టయోటాలు, జీపు, టాటా పికప్‌ ట్రక్‌ వాహనాలున్నట్లు పవన్‌ పేర్కొన్నారు.  

► ఇక తన భార్య అన్నా లెజినోవా పేరిట నగదు రూపంలో రూ.19,340లు.. బ్యాంకు డిపాజిట్లు రూపంలో రూ.86.05 లక్షలు.. రూ.13.97 లక్షల విలువ చేసే బంగారు, వెండి అభరణాలు కలిపి మొత్తంగా రూ.ఒక కోటి చరాస్తులున్నాయి.  

► పిల్లలు దేశాయి అకీరా నందన్‌ పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.89.38 లక్షలు.. దేశాయి ఆద్య పేరిట రూ 87.77 లక్షల బ్యాంకు డిపాజిట్లు.. పోలీనా అంజని పేరిట బ్యాంకు డిపాజిట్లుగా రూ.85.92 లక్షలు.. మార్క్‌ శంకర్‌ పేరిట రూ.86.25 లక్షలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆకీరా నందన్‌కు తన తల్లి 2022లో ఆడి కారు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు.  

► మరోవైపు.. మొత్తం రూ.65.76 కోట్ల మేర తాను బ్యాంకులు లేదా వివిధ వ్యక్తులకు చెల్లించాలని పవన్‌ పేర్కొంటూ, అందులో రూ.17.56 కోట్లు బ్యాంకులకు, మరో రూ.46.70 కోట్లు 15 మంది వ్యక్తులు లేదా సంస్థలకు అప్పులుగా చెల్లించాల్సి ఉందని ఆయన తన అఫిడవిట్‌లో వివరించారు.   

స్థిరాస్తులు.. 
► హైదరాబాద్‌ శంకరపల్లి మండలం జొన్నవాడ గ్రామంలో 18.02 ఎకరాల వ్యవసాయ భూములున్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ. 10.42 కోట్లు ఉన్నట్లు పవన్‌ పేర్కొన్నారు. ► ప్రస్తుత మార్కెట్‌ విలువ అంచనాల ప్రకారం రూ.52.85 కోట్ల విలువచేసే ఏడుచోట్ల స్థలాలు (శేరిలింగంపల్లి మండల పరిధిలో రెండు, మంగళగిరి మండల పరిధిలో నాలుగు, హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఒకటి స్థలాలు ఉన్నట్లు తెలిపారు. మంగళగిరిలో పేర్కొన్న నాలుగు స్థలాల్లో ఒకటి ఈ ఏడాది ఫిబ్రవరి 12న రూ.7.11 కోట్లతో కోనుగోలు చేసినట్లు వివరించారు. 

► ఆ ఏడింటిలో ఒకటి మంగళగిరిలోని స్థలం తన తల్లి బహుమతి రూపంలో ఇచ్చారని.. మిగిలినవి తను కొనుగోలు చేసినవన్నారు.  
► హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రూ. 3.14 కోట్లు విలువచేసే రెండు ఇళ్లు ఉన్నట్లు తెలిపారు.  è రూ.1.95 కోట్లు విలువచేసే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో ఇంటిని భార్య అన్నా లెజినోవాకు బహుమతిగా ఇచ్చానన్నారు. è రూ.22 కోట్లు విలువ చేసే హైదరాబాద్‌ జూబీహిల్స్‌లోని ఇంటిని తన భార్య అన్నా లెజినోవా పిల్లలు పోలీనా అంజని, మార్క్‌ శంకర్‌ ఇద్దరికీ చేరి సగం వాటాగా బహుమతిగా అందజేసినట్లు పవన్‌ పేర్కొన్నారు. 

పవన్‌కళ్యాణ్‌ నామినేషన్‌ 
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన 

పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం నియో­జకవర్గంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ మంగళవారం రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. సోదరుడు నాగబాబు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే  వర్మ, తన న్యాయవాదితో కలిసి వచ్చిన ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు.  ఎన్నికల నిబంధనలను వారు బేఖాతరు చేశారు. నామినేషన్‌ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు నలుగురికే అనుమతి ఉండగా అంతకుమించి లోపలకు అనుమతించారు.  నామినేషన్‌ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మాత్రమే అభ్యర్థుల అనుచరులు ఉండాలన్న నిబంధననూ లెక్కచేయలేదు.  అక్కడ నినాదాలూ చేశారు.  

బీజేపీ నేతలకు పరాభవం.. 
కూటమిలో సభ్యులైన టీడీపీ నేతలకు మాత్రమే విలువనిచ్చిన పవన్‌కళ్యాణ్‌.. అప్పటివరకూ ర్యాలీలో తనతో పాటు తిప్పుకున్న బీజేపీ నేత బుర్రా కృష్ణంరాజుకు నామినేషన్‌ కేంద్రంలోకి వచ్చే అవకాశం లేకుండా చేశారు. తనను పోలీసులు గేటు వద్ద అడ్డుకోవడంతో పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ కృష్ణంరాజు అసహనానికి గురయ్యారు. తరువాత పోలీసులు వర్మ కుమారుడు గిరీష్‌ వర్మతో పాటు ఆయన్ను లోపలకు పంపించారు. ఇక నామినేషన్‌ వేసేందుకు గొల్లప్రోలు మండలం చేబ్రోలు నుంచి ఒకసారి ర్యాలీగా పిఠాపురం చేరుకోవడానికే పవన్‌ అనుమతి తీసుకున్నారు. అయితే, రెండుసార్లు తిరగడం గమనార్హం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement