
గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వకూడదని, వాళ్లకు ఇస్తే పాముకు పాలు పోసిట్లేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని, ఎలాంటి సాయం చేయకూడదని చంద్రబాబు ప్రకటన చేశారు. ఇవ్వకపోవడానికి అదేమైనా మీ బాబుగారి సొమ్మా?. అది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం నడుస్తోంది. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన చంద్రబాబు.. ఇలా బహిరంగంగా, నిసిగ్గుగా మాట్లాడతారా?.
జడ్జిలుగానీ, గవర్నర్‌గానీ చంద్రబాబు(Chandrababu) లేదంటే నా ఈ వ్యాఖ్యలైనా ఒకసారి చూడాలి. ఇలాంటి వ్యక్తి సీఎంగా అర్హుడేనా?.. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రానికైనా శ్రేయస్కరమా?. ఇలాంటి వ్యక్తిని సీఎం స్థానంలో కొనసాగించడం ధర్మమేనా? అని జగన్ ప్రశ్నించారు.
