సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ‘నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని ధ్వజమెత్తారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హరీష్‌రావుకు నోటీసులు జారీ చేసింది. ఇవాళ జూబ్లీహిల్స్ పీఎస్‌లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే ఈ పరిణామంపై హరీష్ రావు తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
‘నిన్న రేవంత్ బావమరిది బాగోతాన్ని బయటపెట్టా. సాయంత్రం తొమ్మిదిగంటల సమయంలో హైదరాబాద్‌లోని నా నివాసంలో నోటీసులు ఇచ్చారు. ఆ సమయంలో నేను నా నియోజకవర్గం సిద్ధిపేటలో పలు కార్యాక్రమాల్లో పాల్గొన్నాను. అయినప్పటికీ.. చట్టం మీద గౌరవంతో హైదరాబాద్‌కు వచ్చా.
నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడను. అక్రమాలు, బొగ్గు, భూస్కాం, హామీల అమలు విషయాలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందే వీరి అవినీతి బయటపడుతుందని నాకు నోటీసులు ఇచ్చారు. నేను ఏ తప్పు చేయలేదు. ఈ నోటీసులు కొత్త కాదు. గతంలో నా మీద ఫోన్ టాపింగ్ కేసు పెడితే హై కోర్టు, సుప్రీం కోర్టులో కొట్టేశారు. అయినా మళ్ళీ పిలుస్తున్నారు. ఎన్ని రోజులు ఈ డ్రామా?’అని ప్రశ్నించారు.


