సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని రేవంత్ కుట్ర చేస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇస్తూ.. బీఆర్‌ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్‌కు దిమ్మ తిరిగే బదులిస్తామంటూ హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కొలేకే భౌతికదాడులకు పిలుపునిచ్చారని.. హింసను ప్రేరేపించేలా సీఎం వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ హరీష్ మండిపడ్డారు.
‘‘ముమ్మాటికీ రేవంత్ రెడ్డిది ద్రోహ చరిత్ర. అడుగడుగునా వెన్నుపోట్లు.. అనుక్షణం అబద్ధాలు.. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ద్రోహాల పుట్ట. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉంది. చంద్రబాబు తరపున ఎమ్మెల్యేలను కొనేందుకు నోట్ల బ్యాగులు మోస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన 'ఓటుకు నోటు' దొంగ.. సీఎం పదవి అనుభవిస్తూనే, కేంద్రంలోని బీజేపీతో చీకటి స్నేహాలు చేస్తూ సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వంచిస్తున్న కాంగ్రెస్ ద్రోహి రేవంత్’’ అంటూ హరీష్ ఘాటుగా విమర్శించారు.


