సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారు. మహిళా కార్పొరేటర్లని కూడా చూడలేదు. డిప్యూటీ మేయర్‌పై పాశవికంగా దాడి చేశారు. అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి?..
.. కూటమి ప్రభుత్వంలో సిగ్గూ, శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే భూముల్ని గీతంకు కట్టబెట్టారు. గీతంకు భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్‌డే. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.
అంతకు ముందు.. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేసింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నేతలంతా నల్ల కండువాలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందన్నారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారాయన.
గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్ భేటీలో గీతం భూముల క్రమబద్దీకరణ చేసింది కూటమి ప్రభుత్వం.


