Sakshi News home page

పార్టీ మారినా.. నో ఫియర్!!

Published Sat, Mar 30 2024 7:12 AM

GHMC Mayor Gadwal Vijayalakshmi likely to switch to Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ నుంచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ  నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్‌లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్‌ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్‌ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు.

 మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. 

ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి.  

మారనున్న బలాబలాలు 
రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్‌ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ దంపతులు,  మాజీ డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్‌ దంపతులు శ్రీలత, శోభన్‌రెడ్డిలు  సైతం కాంగ్రెస్‌లో చేరడం  తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలిసింది. 

ఫలించిన కాంగ్రెస్‌ వ్యూహం 
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్‌ఎంసీ మేయర్‌గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్‌లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్‌ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్‌లో చేరతారని  రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని  చెబుతున్నారు. తమ డివిజన్లలో  ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. 

Advertisement
Advertisement