అధికారంలోకొస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం | Sakshi
Sakshi News home page

అధికారంలోకొస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Published Fri, Jun 16 2023 4:25 AM

Free bus travel for women says revanth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే కర్ణాటక తరహాలోనే తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి చెప్పారు. అలాగే పేదలు ఇళ్లు కట్టుకొనేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని హామీ ఇచ్చారు.

గురువారం జూబ్లీహిల్స్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్‌ జిల్లా నేత కంది శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో వివిధ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి కండువాలు కప్పి రేవంత్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ ఎన్నికల హామీలను వెంటనే నెరవేరుస్తామని చెప్పారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్‌ జిల్లాను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్‌తోపాటు షాద్‌నగర్, ఉప్పల్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement