
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.
తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్‌కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.
‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు.