
సాక్షి, తాడేపల్లి: అసలు లేని, జరగని లిక్కర్ స్కామ్‌పై రోజుకో కథనాన్ని వండి వారుస్తున్న ఈనాడు.. వైఎస్సార్‌సీపీని అప్రతిష్టపాల్జేయడానికి అత్యంత హేయంగా వ్యవహరించిందని పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు.
ఏపీ బీసీఎల్ (రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో, 2019–24 మధ్య లిక్కర్ కుంభకోణానికి సంబంధించి 3.58 లక్షల జీబీ డేటాను డిలీట్ చేశారంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించిందని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలిపారు. ప్రెస్‌మీట్‌లో ఎం.మనోహర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..
ఏపీ బీసీఎల్ ఏం చెప్పిందంటే..:
రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీ బీసీఎల్) సర్వర్లు, డేటా సిస్టమ్స్ నుంచి 371 కోట్ల పేజీలకు సంబంధించిన 3.58 లక్షల జీబీ డేటా డిలీట్ చేశారంటూ, ఈనాడు రాసిన వార్త నిజమేనా అని సమాచార హక్కు (ఆర్‌టీఐ) కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అడిగిన ప్రశ్నపై ఆ సంస్థ సమాధానం చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తమ వద్ద ఎలాంటి డేటా డిలీట్ కాలేదని, అసలు అలాంటిదేమీ జరగలేదని ఏపీ బీసీఎల్ వెల్లడించింది.
వాస్తవం ఇలా ఉంటే.. ‘వేల కోట్లు దోచేసి ఆధారాలు చెరిపేసి’ అంటూ ఈనాడు నిస్సిగ్గుగా కథనాన్ని వండి వార్చింది. దాని ఆధారంగా ఈటీవీలో కూడా ఏకంగా 8 నిమిషాల కథనాన్ని ప్రసారం చేశారు. అంటే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద చల్లడం, వైఎస్సార్‌సీపీని అప్రతిష్టపాల్జేయడమే లక్ష్యంగా ఈనాడు ఏ స్థాయికి దిగజారి వ్యవహరిస్తోంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
వైఎస్సార్‌సీపీకి క్షమాపణ చెప్పాలి:
ఒక నీచమైన దుర్భుద్ధి, కుట్ర, కుతంత్రంతో వ్యవహరిస్తూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిత్యం బురద చల్లడమే లక్ష్యంగా పని చేస్తున్న ఈనాడు యాజమాన్యం ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం, ఆ పత్రిక చేస్తున్న కుట్ర, కుతంత్రాలపై పూర్తి సమాచారం, వివరాలతో ప్రెస్ కౌన్సిల్‌లో ఫిర్యాదు చేస్తాం. ఏ మాత్రం విచక్షణ ఉన్నా.. ఇప్పటికైనా ఈనాడు, ఈటీవీ యాజమాన్యం చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, జర్నలిస్టు విలువలను పాటించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలి.
అంతా ఒక వ్యూహం:
‘సిట్’ దర్యాప్తు తీరు, ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించిన అంశాలు చూస్తే.. ఎల్లో మీడియాలో గాలి వార్తలన్నీ పోగేసి రాస్తున్న కథనాలను ప్రతిబింబిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంతులేని ప్రజాభిమానం కలిగిన జగన్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయనను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న దురుద్దేశంతో, తనకు సన్నిహితంగా ఉండి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, వ్యక్తుల మీద తప్పుడు కథనాలు రాసి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు.
ఇక ప్రభుత్వం తాము టార్గెట్‌గా పెట్టుకున్న వారిని అరెస్టు చేసేందుకు.. తొలుత వారిపై తమ అనుకూల ఎల్లో మీడియాలో కథనాలు రాయించడం, ఆ తర్వాత ఎవరితోనో ఫిర్యాదు చేయించడం, వాటి ఆధారంగా కొందరిని అదుపులోకి తీసుకుని వేధించి, భయపెట్టి తమ టార్గెట్ లిస్ట్‌లో ఉన్న వారి పేర్లు చెప్పించి, స్టేట్‌మెంట్ రికార్డు చేయడం, దాని తర్వాత తప్పుడు కేసు పెట్టి, అక్రమ అరెస్టు చేయడం ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే.. ఈ కేసులు, అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి వివరించారు.