‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం | Sakshi
Sakshi News home page

‘తూర్పు’ బరిలో డిష్యుం..డిష్యుం

Published Tue, Jan 23 2024 5:21 AM

Differences in TDP are like a raging fire - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూ­డు వర్గాలుగా విడిపోయిన ఆ పార్టీ నేతలు కయ్యాలకు కాలు దువ్వుతున్నారు. ఎమ్మె­ల్యే సీటు నాదంటే నాదంటూ బాహా­టంగా ప్రకటించుకుంటూ తిరుగుతున్నారు. ఈ పరి­ణా­­­మం ఆ పార్టీ శ్రేణులను అయోమయా­నికి గు­రి చేస్తోంది.

అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాల్సి­న టీడీపీ అధినేత చంద్రబాబు నాన్చుడు ధోర­ణి అవలంబిస్తూ అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. పలుమార్లు జిల్లాలో పర్యటించి­న బాబు స్వపక్ష నేతల మధ్య నెలకొన్న వైషమ్యాలను చక్కదిద్దలేక చేతులెత్తేశారు. దీనికి తోడు జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా ఎ­వ­రి సీటుకు ఎసరు వస్తుందోనన్న మీమాంస నెలకొంది. ఆది నుంచీ ఉన్న వారి­కి భంగపాటు తప్పదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

నిడదవోలులో ‘సోషల్‌’ వార్‌
నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై స్వపక్షంలో అయోమయం ఏర్ప­­డింది. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషా­రావు, టీడీపీ నేత కుందుల సత్యనారా­య­­ణలు సీటు కోసం నువ్వా నేనా? అనే రీతిలో చక్రం తిప్పుతున్నారు. అధినేత ప్రసన్నం కోసం ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరో అడుగు ముందుకేసి సోష­ల్‌ మీడియాలో వార్‌కు దిగారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లో మా నాయకుడే ఎమ్మెల్యే అవుతాడని ఇరు వర్గాలూ పోస్టులు పెడుతూండటంతో ద్వితీయ స్థాయి నాయకులు ఎ­వరి వెంట నడవాలో తెలియక తలలు పట్టు­కుంటున్నారు. తనకే కేటాయించాలని టీడీపీ అధిష్టానానికి కుందుల సత్యనారాయణ భారీగా ముట్టజెప్పినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు జనసేన నుంచి మరో ముగ్గురు బరిలోకి దిగేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.

పవన్‌ కళ్యాణ్‌కు సన్నిహితంగా ఉండే సినీ నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌తో పాటు తణుకు జనసేన ఇన్‌చార్జ్‌ విడివాడ రామచంద్రరావు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఆశి­స్తుండగా.. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్‌ సైతం రేసులో ఉన్నారు. పొత్తులో భాగంగా నిడదవోలు జనసేనకు కేటాయిస్తారని, తామే పోటీ చేస్తామని జనసేన నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న అంశం టీడీపీ నేతల్లో మింగుడు పడటం లేదు.

గోపాలపురం.. గందరగోళం
గోపాలపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు ముదురు పాకాన పడుతున్నాయి. ఆది నుంచీ పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో మద్దిపాటి వెంకట్రాజును బాబు నియమించారు. కనీస సమాచారం లేకుండా ఎందుకు మార్చారని ముప్పిడి వర్గం చంద్రబాబును నిలదీసింది.

వచ్చే ఎన్నికల్లో మద్దిపాటే పోటీ చేస్తారని బాబు ప్రకటించడంతో ఇరు వర్గాల మధ్య విభేదాల అగ్గి మరింతగా రాజుకుంది. అప్ప­టి నుంచీ ముప్పిడి వర్గం, ఎస్సీ సామాజికవర్గ నేతలు టీడీపీ అధినేతపై గుర్రుగా ఉన్నా­రు.  ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా.. ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరకపోగా తాడోపేడో తేల్చుకునేందుకు అధిష్టానం వద్ద బలప్రదర్శనకు దిగుతున్నారు.

కొవ్వూరులో ఎస్సీలకు అవమానం
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన కొవ్వూరులో ఆ సామాజిక వర్గాలకు ఘోర అవమానం ఎదురవుతోంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించి, తమకు అన్యాయం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గీయుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌కు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించినా కొవ్వూరు పార్టీ వ్యవహారాలకు ఆయనను దూరం పెట్టారు. పెండ్యాల అచ్చిబాబుకు అందలం వేయ­డం.. జవహర్‌కు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ద్వితీయ స్థాయి నేతలు పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు కొవ్వూరు అభ్యర్థిత్వం తనదేనంటూ చెప్పుకుంటూండటంతో ఇరు వర్గాలూ కత్తులు దూస్తున్నాయి.

రాజానగరం.. గరంగరం
రాజానగరంలో రాజకీయం రంజుగా మారుతోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజానగరం జనసేనకు కేటా­యిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే సీటు తనకే వరిస్తుందని జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధి­నేత పవన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానని ప్రకటిస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధిష్టానానికి భారీ స్థాయిలో పార్టీ ఫండ్‌ ఇచ్చారని.. అందుకే అంత ధైర్యంగా ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది.

ఈ పరి­ణామం ఇప్పటికే రాజానగరం నుంచి టీడీపీ టికెట్‌ ఆశి­స్తున్న బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో అగ్గి రాజేస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న తనను కాదని, జనసేనకు టికెట్‌ ఇస్తారన్న ప్రచా­రం రెండు వర్గాల మధ్య చిచ్చు రేపుతోంది. మరోవైపు బొడ్డు వెంకట రమణ చౌదరిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించడంపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ వర్గం ఇప్పటికే పార్టీ అధినేతపై గరంగరంగా ఉంది.

ఒకవేళ టీడీపీకే ఈ సీటు కేటా­యించినా ఇటు పెందుర్తి వర్గం, అటు జనసేన శ్రేణులు వెంకట రమణ చౌదరికి జెల్ల కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని జనసేనకే కేటా­యించినా ఆ పార్టీ అభ్యర్థికి టీడీపీ వర్గాలు మద్దతు తెలిపే అవకాశాలు కనిపించడం లేదు.

రాజమహేంద్రవరం రూరల్‌లో తేలని పంచాయితీ
రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే స్థానం­పై టీడీపీ – జనసేన మధ్య నెలకొన్న పంచాయితీ నేటికీ కొలిక్కి రావడం లేదు. పొత్తు నేపథ్యంలో తనకే ఈ సీటు దక్కుతుందని జ­న­సేన నేత కందుల దుర్గేష్‌ చెబుతూండగా.. తన స్థానంలో పోటీ చేసే ధైర్యం ఇతరులెవరికైనా ఉందా? తానే పోటీ చేస్తానని టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేస్తున్నారు. ఈ పరిణామం రెండు పార్టీల నేతల్లో విభేదాలకు ఆజ్యం పోస్తోంది.

Advertisement
 
Advertisement