ఫ ఇదే అనుకూల సమయం
ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం
పెరవలి: తియ్యని దిగుబడులను ఇచ్చే చెరకు సాగుకు ఇదే అనుకూలం.. సరైన సమయంలో సాగు చేస్తే సిరుల పంటే. తూర్పు గోదావరి జిల్లాలో 850 హెక్టార్లలో చెరకు పంట వేస్తున్నారు. ఇందులో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం మండలాలు ఉన్నాయి. ఈ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఆ వివరాలు ఇలా..
నేలల స్వభావం
చెరకు పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనుకూలం. ఈ భూముల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకూ మెత్తని దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియ దున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి.
నాటే సమయం
ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జూన్ నుంచి జూలై వరకూ, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ నాటుకోవచ్చు. మొదటిసారి పంట వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి.
నీటి యాజమాన్యం
పంట వేసిన తరువాత ఆరు రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగునీటిని అందించాలి. పక్వానికి వచ్చిన దశలో 3 వారాలకొకసారి నీరు అందించవచ్చు.
ఎరువులు ఇలా..
చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన మూడో రోజు ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బ్యాక్టీరియాను నాటిన ఆరో రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు.
కార్సి తోటల సాగు
మొక్కతోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుంచి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణ కోసం మందులను వాడకూడదు. కార్సి తోటలున్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ లేదా ఆ చెత్తను కుళ్లబెట్టడానికి ట్రై కోడెర్మావిరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండు కలిపి చెత్తపై చల్లాలి. దీనివల్ల భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసు పురుగు, తెల్లనల్లి, లద్ది పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్రకుళ్లు తెగులు, మొవ్వకుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.


