అవిశ్రాంత సేవకులపైచిన్నచూపు | - | Sakshi
Sakshi News home page

అవిశ్రాంత సేవకులపైచిన్నచూపు

Mar 3 2026 8:12 AM | Updated on Mar 3 2026 8:12 AM

పెన్షనర్ల డిమాండ్లు పట్టించుకోని ప్రభుత్వం

ఒకటో తేదీకి అందని పెన్షన్‌ సొమ్ము

గాల్లో కలిసిన ఎన్నికల హామీలు

కపిలేశ్వరపురం: ఆసక్తితో చదువుకుని, ఆశతో పోటీ పడి పొందిన ఉద్యోగాన్ని సుమారు 30 ఏళ్ల పాటు నిబద్ధతతో చేస్తారు. ఉద్యోగంలో చేరిన ఆరంభంలో ఆనందంగానే ఉన్నా మధ్యలో పెరిగిన కుటుంబ ఖర్చులతో అప్పులు చేస్తూ అవస్థలు పడుతూంటారు. వయస్సు మీద పడిన తర్వాత ఉద్యోగ విరమణ చేసే సమయానికి శేష జీవితం ఆందోళనకరంగా తలపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన జీవితానికి చుక్కానిలా పెన్షన్‌ ఆధారమవుతుంది. సకాలంలో పెన్షన్‌ అందితేనే రోజులు సుఖంగా గడుస్తాయి. కానీ, ఈ అవిశ్రాంత సేవకులను పాలకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా పెన్షనర్ల సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఒకటి రెండు నెలలు తప్ప ఆ తర్వాత నుంచి ప్రతి నెలా వారం తర్వాతే పెన్షన్‌ చెల్లిస్తున్నారు.

అత్యధిక పెన్షనర్లకు రూ.3 వేల లోపే..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించి, రిటైరైన వారు సుమారు 50 వేల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులకు రూ.3 వేల లోపు మాత్రమే పెన్షన్‌ చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్‌ ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్‌ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్‌ ఇస్తున్నారు. ఇంత తక్కువ పెన్షన్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పలుమార్లు నిరసన తెలిపారు. వృత్తి రీత్యా చెల్లిస్తున్న పెన్షన్‌కు తోడు వృద్ధులకు అందజేసే రూ.4 వేల సామాజిక పింఛను కూడా వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి.

పోరుబాటలో..

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు పలు రూపాల్లో ఉద్యమిస్తున్నారు. గత నెల 9న ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. గత జనవరి 18న ఆలిండియా బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం అమలాపురంలో నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్యోగుల వేతన సవరణతో సంబంధం లేకుండా 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ రిటైర్డ్‌ ఉద్యోగులకు పెన్షన్‌ సవరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆలిండియా కో ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఈపీఎఫ్‌ పెన్షనర్స్‌ సంఘం ఆధ్వర్యాన ఈపీఎఫ్‌–95 పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.9 వేలకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ గత ఏడాది డిసెంబర్‌ 9న ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. అదే నెల 10న ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేశారు. ఆయా కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలోని పెన్షనర్లు తరలి వెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్‌ వ్యాలిడేషన్‌ బిల్లు–2025ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

సామాజిక పింఛన్ల కోసం..

తూర్పు గోదావరి జిల్లాలో 2,70,496 మందికి రూ.118.61 కోట్ల మేర సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. అవి ఎప్పటి నుంచో ఇస్తున్నవే తప్ప చంద్రబాబు 20 పాలనా కాలంలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్‌ కూడా మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు సర్వే పేరుతో కోత పెట్టారు. కొత్త పింఛన్‌ కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్లకే పెన్షన్‌ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికొదిలేశారు.

రూ.3 వేలతో ఎలా బతకాలి?

దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్‌ అందుకుంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.3 వేలు పైగా పెన్షన్‌ పొందుతున్నారు. ఈ రూ.3 వేలతో కుటుంబం గడవడం సాధ్యం కాదు. ధరలు పెంచుతున్న పాలకులు అందుకు అనుగుణంగా పెన్షన్‌ కూడా పెంచాలి.

– సీహెచ్‌ మోహనరావు, కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌, ధవళేశ్వరం

ఇవీ పెన్షనర్ల డిమాండ్లు

ఇన్సూరెన్స్‌ ఆధారిత హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి.

5 డీఏలు మంజూరు చేయాలి.

12వ పే కమిషన్‌ నియమించాలి.

2018 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బకాయిలూ వెంటనే చెల్లించాలి.

2024 ఆగస్టు నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలి.

2020 తర్వాత మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి.

పెన్షన్‌ వ్యాలిడేషన్‌ బిల్లు–2025 రద్దు చేయాలి.

భిక్ష కాదు.. హక్కు

పెన్షన్‌ ఇవ్వడాన్ని పాలకులు వారి గొప్పగా చెబుతూంటారు. వాస్తవానికి పెన్షన్‌ పొందడం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు. సుమారు 30 ఏళ్ల పాటు తమ శ్రమశక్తిని సమాజానికి ధారబోసి.. ఉద్యోగ విరమణానంతరం రోజువారీ జీవితం గడిపేందుకు పెన్షన్‌ పొందే హక్కు ఓ చారిత్రక నేపథ్యంలో ఉనికిలోకి వచ్చింది. 1889లో పెన్షన్‌ నామమాత్రంగా ఉండేది. 1920లో బ్రిటిషు కాలంలో రిటైర్డ్‌ బెనిఫిట్‌ పెన్షన్‌ ప్రవేశపెట్టారు. ఢిల్లీ మిలిటరీ అధికారి డీఎస్‌ నకారా పెన్షన్‌ కోసం న్యాయపోరాటం చేశారు. పలు పోరాటాల ఫలితంగా 80వ దశకంలో ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌–1980, 1981లో కుటుంబ పెన్షన్‌ అమలులోకి వచ్చాయి. అంతిమంగా 1982 డిసెంబర్‌ 17న అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ పెన్షన్‌ ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement