నిప్పుతో చెలగాఢాం.. | - | Sakshi
Sakshi News home page

నిప్పుతో చెలగాఢాం..

Mar 3 2026 8:13 AM | Updated on Mar 3 2026 8:13 AM

బాణసంచా తయారీలో

నిబంధనలు గాలికి

వరుస ప్రమాదాలతో ఆరని నిప్పు

ప్రమాదకర వృత్తిలో పేద కుటుంబాలు

అవగాహన లేక ప్రాణాలకే ముప్పు

పిఠాపురం: మిరుమిట్లు గొలిపే వెలుగులు.. భారీ శబ్దాలతో పేలే టపాసులు కొందరికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.. వాటి తయారీలో మాత్రం పేదల బతుకులు ‘కూలి’పోతున్నాయి.. లాభాల్లో మునిగి యజమానులు, పర్యవేక్షణా లోపంతో అధికారులు ఉండడంతో బడుగుల జీవుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. ఒకప్పుడు బాణసంచా కేవలం దీపావళికి మాత్రమే కాల్చేవారు. రానురానూ ఏ శుభకార్యం, పండగ, జాతర చివరకు అంతిమయాత్రల్లోనూ వాడుతున్నారు. దీనివల్ల టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఫైర్‌ వర్క్స్‌లో పేదలు జీవనోపాధి పొందుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జీవితాలను మంటల్లోకి నెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తే పరిస్థితి అర్ధమవుతోంది. కొన్ని నెలల కిందట రాయవరం, ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయి అయినవారికి విషాదాన్ని మిగిల్చారు.

ఈ పనిలోకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ వారి ప్రాణాలకు రక్షణ ఉండడం లేదు. అయినా అదే వృత్తిని కొనసాగించడం వారి కుటుంబాలకు శాపంగా మారుతోంది. అన్నీ తెలిసినా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చే కొద్దిపాటి కూలి డబ్బుల కోసం వెళ్లి విలువైన తమ ప్రాణాలు కోల్పోయి వెనుక ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా చేసుకుంటున్నారు. దీంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా 20 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 50కు పైనే ఉన్నట్లు సమాచారం.

కడచూపు కరువాయే..

మూడు రోజుల కిందట వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌ వద్ద జరిగిన విస్ఫోటం కూలీల కుటుంబాలను కుదిపేసింది. కూలి డబ్బులు తెస్తా.. నీకు సామాన్లు తీసుకొస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా పోయారు. కడసారి చూపునకు కూడా వీల్లేకుండా కాలి బూడిదయ్యారు. గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా ఏడుద్దామన్నా ఏ శవం ఎవరిదో తెలియని హృదయ విదారకమైన పరిస్థితి. మృతదేహాలను నేరుగా మరుభూమికే తరలించడంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేకపోయ్యింది. ఒకరా ఇద్దరా ఏకంగా 22 మంది చూడటానికి ఆకారం లేదు.. ఎవరో తెలుసుకుందామంటే ముఖాలు కనిపించడం లేదు.. గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు.. ఈ పరిస్థితుల్లో తెల్లవస్త్రంలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. తల్లి.. తండ్రి.. భర్త.. భార్య, పిల్లలు ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పోయి పుట్టెడు దుఖఃలో బాధిత కుటుంబాలు ఉన్నాయి.

అవగాహనా లోపమే శాపం

బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులే. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే ముడిసరకుపై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన ఉండదు. బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతి కార్మికుడి ముఖానికి మాస్క్‌ తప్పనిసరి ఉండాలి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. పొటాషియం నైట్రేట్‌, మెగ్నీషియం పౌడర్‌, సల్ఫర్‌ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తున్నాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అవగాహన కల్పించకుండా కూలీలతో పనులు చేయించడం పేలుళ్లకు దారి తీస్తోంది. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్‌ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌ తప్పనిసరి. కానీ ఎక్కడా అది జరగడం లేదు.

వరుస ఘటనలు.. కలవరపాట్లు

బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. సాధారణంగా మందుగుండు సామగ్రి అతి తక్కువ పేలుడు పదార్థాలతో మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాల్చే విధంగా, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా చేయాలి. కానీ విదేశీ మందుగుండు రాకతో వాటిని పోటీగా చేసుకుని రంగు రంగుల బాణసంచా తయారీతో పాటు శక్తివంతమైన అతి పెద్ద శబ్దాలు వచ్చే పోటాపోటీగా మందుగుండు కొత్త పద్ధతుల్లో తయారీ చేస్తున్నారు. దీంతో వీటి పవర్‌ మందు పాతర మాదిరిగా తయారవుతోంది. ఎక్కడైనా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగితే అది మందుగుండు పేలినట్లు కాకుండా మందు పాతర పేలినట్లు విస్ఫోటం సృష్టిస్తుంది. తద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. అధికారులు ‘మామూళ్లు’ తనిఖీలే తప్ప పూర్తిగా దృష్టి సారించకోవడం పెను ప్రమాదాలకు కారణమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement