
అసెంబ్లీ ఎన్నికలకు ఏడు నెలలే సమయం ఉండడంతో తమిళనాట రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రతిపక్ష అన్నాడీఎంకే అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టు కట్టింది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి (ఈపీఎస్) దాదాపు ఖరారయ్యారు. దీనికి తమిళ బీజేపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. అయితే తాను మాత్రం ఒప్పుకోనంటున్నారు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం చీఫ్ టీటీవీ దినకరన్ (TTV Dhinakaran).
ఎన్డీఏ కూటమి నుంచి కొద్దిరోజుల క్రితం దినకరన్ బయటకు వెళ్లిపోయారు. ఆయనను మళ్లీ ఎన్డీఏలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 21న స్వయంగా దినకరన్ ఇంటికి వెళ్లి భేటీ అయ్యారు. తమతో చేతులు కలపాలని కోరారు. భేటీ తర్వాత అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. ''మా భేటీలో రహస్యాలు ఏమీ లేవు. దినకరన్ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు. హఠాత్తుగా బయటకు వెళ్లడంతో ఆయనను కలిసి మాట్లాడాను. ఎన్డీఏలోనే కొనసాగాల''ని కోరినట్టు వెల్లడించారు. నవంబర్ తర్వాత టీటీవీ దినకరన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన చెప్పారు.
ఈపీఎస్‌ను ఓడిస్తాం
అయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. అయితే దినకరన్ మాత్రం మూడు రోజుల్లోనే తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నంత కాలం తాను తిరిగి కూటమిలోకి రానని తెగేసి చెప్పేశారు. "నేను 2021లో కూడా ఆయనను వ్యతిరేకించాను. సీనియర్ నాయకులు నన్ను కోరినందున మాత్రమే నేను ఆయనను అంగీకరించాను. ఈసారి, మా పార్టీ ప్రత్యేకంగా ఈపీఎస్‌ను ఓడించడానికి పోరాడుతుంద"ని మీడియాతో చెప్పారాయన. తనను ఎన్డీఏ కూటమిలోకి తిరిగి తీసుకురావడానికి మధ్యవర్తుల ద్వారా బీజేపీ ఢిల్లీ పెద్దలు చేసిన ప్రయత్నాలను తాను తిరస్కరించినట్టు వెల్లడించారు.
బీజేపీకి ఎదురుదెబ్బ
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించేందుకు దృఢమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి దినకరన్ నిర్ణయం ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత సన్నిహిత స్నేహితురాలు వీకే శశికళ (VK Sasikala) మేనల్లుడు దినకరన్‌కు తమిళనాడులో అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉంది. అన్నామలై చొరవతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిశారు. బీజేపీ పెద్దలు ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా దాదాపు ఖరారు చేయడంతో దినకరన్ జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దినకరన్ నిష్క్రమణ కమలనాథులకు సంకటంగా మారింది. ఆయనను ఎలాగైనా కూటమిలో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పళనిస్వామి పంతం
మరోవైపు జయలలిత (Jayalalithaa) మరణం తర్వాత అన్నాడీఎంకేను తన గుప్పిట్లో పెట్టుకున్న పళనిస్వామి మాత్రం దినకరన్‌తో పాటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం (ఓపీఎస్)ను మళ్లీ చేరదీయకూడదని భీష్మించుకుని కూర్చుకున్నారు. పార్టీని వదిలివెళ్లిన వారు, బహిష్కరణకు గురైన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని అన్నాడీఎంకే సీనియర్ నేత సెంగోట్టయన్ చేసిన ప్రతిపాదనపై పళనిస్వామి తీవ్రంగా స్పందించారు. పార్టీ పదవుల నుంచి సెంగోట్టయన్, ఆయన మద్దతుదారులను పీకిపారేశారు. తనకు వ్యతిరేకంగా వ్యహరిస్తే చర్యలు తప్పవని పరోక్షంగా హెచ్చరికలు పంపారు. దీంతో పళనిస్వామిపై సెంగోట్టయన్ (Sengottaiyan) మద్దతురాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటు ఓపీఎస్, దినకరన్ కూడా సెంగోట్టయన్‌కు బాసటగా నిలిచారు.
చదవండి: అన్నాడీఎంకేలో కలకలం.. రంగంలోకి అమిత్ షా!
ఈ పరిణామాల నేపథ్యంలో దినకరన్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడులో డీఎంకేను ఓడించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని బీజేపీ భావిస్తోంది. అటు చూస్తే అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు, ఇటు చూస్తే దినకరన్ నిష్క్రమణతో కాషాయ పార్టీకి కలవరం తప్పడం లేదు. అయితే దినకరన్ ఇదే మాట మీద ఉంటారా, దిగివస్తారా అనేది వేచిచూడాలి.