
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమిళనాట రాజకీయ కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ఎన్నికల బరిలో దిగేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అధికార డీఏంకే మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తుండగా, ప్రతిపక్ష అన్నాడీఎంకే ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తోంది. అగ్ర కథానాయకుడు విజయ్.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నాయకుడు టీటీవీ దినకరన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు.
ఎంకే స్టాలిన్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని అన్నాడీఏంకే గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీతో జట్టు కట్టింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె పళనిస్వామితో (Edappadi K Palaniswami) పాటు బీజేపీ అగ్ర నేతలు ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ జాతీయ నాయకుడు అమిత్ షా.. తమిళనాడుకు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నవంబర్ నుంచి వరుస పర్యటనలు చేపట్టేలా కసరత్తు జరుగుతోంది.
ఇదిలావుంటే పార్టీలో అంతర్గత విభేదాలు అన్నాడీఎంకేకు తల నొప్పిగా మారాయి. పళనిస్వామి వ్యవహారంపై సొంత పార్టీ నాయకులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి, సీనియర్ నేత కేఏ సెంగోట్టయన్ (KA Sengottaiyan) పట్ల వ్యవహరించిన తీరును అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. పళనిస్వామి ఒంటెత్తు పోకడలతో నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.
అసలేం జరిగింది?
పార్టీని వదిలిపెట్టిన వారిని, బహిష్కరించిన వారిని మళ్లీ అక్కున చేర్చుకోవాలని సెంగోట్టయన్ పిలుపు ఇవ్వడంతో అన్నాడీఏంకేలో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ అధినేత పళనిస్వామికి సెంగోట్టయన్ వ్యాఖ్యలు ఏమాత్రం రుచించలేదు. దీంతో ఆయనను పార్టీ పదవుల నుంచి తప్పించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఈరోడ్ రూరల్ పశ్చిమ జిల్లా కార్యదర్శి పదవి నుంచి సెంగోట్టయన్‌ను తీసిపారేశారు. అక్కడితో ఆగకుండా ఆయన మద్దతుదారులపైనా కొరడా ఝళిపించారు. సెంగోట్టయన్ మద్దతురాలైన మాజీ ఎంపీ సత్యభామను పార్టీ పదవుల నుంచి తొలగించారు.
పార్టీ మంచి కోరే..
పళనిస్వామి నిర్ణయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతా కలిసి సమిష్టిగా పోరాడితే అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతోనే తాను మాట్లాడానని అన్నారు. పార్టీ మంచి కోరే ఐక్యత రాగం అందుకున్నానని, మరో అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఎటువంటి వివరణ అడకుండానే తనను పార్టీ పదవులకు దూరం చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సెంగోట్టయన్ వ్యాఖ్యలను బహిష్కృత నేతలతో పాటు బీజేపీ, డీఎండీకే పార్టీలు స్వాగతించగా.. పళనిస్వామి ఫైర్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఓపీఎస్ భరోసా!
సెంగోట్టయన్‌కు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ బాసటగా నిలిచారు. సెంగోట్టయన్‌కు తన మద్దతు ఉంటుందని, ఆయనను త్వరలో కలుస్తానని పన్నీర్ సెల్వం (Panneerselvam) ప్రకటించారు. జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ కూడా తెర ముందుకు వస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నాడీఎంకే అసంతృప్త నాయకులందరూ ఒక వేదికపైకి వచ్చే అవకాశముందన్న వాదనలు విన్పిస్తున్నాయి.
చదవండి: డీఎంకేకు నిద్రలేకుండా చేస్తున్న విజయ్!
రంగంలోకి అమిత్ షా!
అన్నాడీఎంకే పార్టీలో రేగిన దుమారాన్ని కట్టడి చేసేందుకు బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) రంగంలోకి దిగినట్టు కనబడుతోంది. మంగళవారం సెంగోట్టయన్‌ను ఢిల్లీకి పిలిపించుకుని ఆయనతో మాట్లాడారు. అమిత్ షాతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయినట్టు సెంగోట్టయన్ వెల్లడించారు. 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని బలోపేతం చేయడానికి, బహిష్కృత అన్నాడీఎంకే నేతలను తిరిగి చేర్చుకోవడంపై తన అభిప్రాయాలను వారితో పంచుకున్నానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో సెంగోట్టయన్ భవిష్యత్ కార్యాచరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.