సాక్షి, చైన్నె: గోబి చెట్టి పాళయంలోని తన నివాసంలో రాజకీయ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి మద్దతు దారులతో సెంగ్టోయన్ బుధవారం నుంచి మంతనాలలో మునిగారు. అందరి అభిప్రాయాలను స్వీకరిస్తూ వస్తున్నారు. ఆయన వద్దకు పెద్దసంఖ్యలో మద్దతు దారులు తరలి వస్తున్నారు. అన్నాడీఎంకేలో సమన్వయం, సమష్టి, ఐక్యత నినాదాన్ని అందుకున్న పదవులను సీనియర్ నేత సెంగోట్టయన్ పోగొట్టకున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళని స్వామి చర్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న సెంగ్టోయన్ మంగళవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్‌లను కలిసి వచ్చారు.
ఢిల్లీ పెద్దల ముందు తన వాదనను, అభిప్రాయాలను ఉంచి ఈరోడ్‌కు వచ్చిన సెంగ్టోయన్ బుధవారం ఉదయం నుంచి పొద్దు పోయే వరకు మద్దతు దారులతో సమావేశాలతో బిజీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి మద్దతు దారులతో మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను సెంగోట్టయన్ స్వీకరిస్తూ వస్తున్నారు. అలాగే పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలందర్నీ ఒక చోట చేర్చే దిశగా పోన్ మంతనాలు సైతం ఆయా నేతలతో సాగుతున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. పళణి స్వామికి సెంగోట్టయన్ విధించిన పది రోజుల గడువు ఈనెల 15వతేదీ ముగియనుంది. ఆ తదుపరి సెంగోట్టయన్ పరిణామాలు, బాట ఎలా ఉంటుందో అన్న చర్చ ఊపందుకుంది.
సూపర్ చైన్నె పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, చైన్నె : చైన్నె భవిష్యత్తును, సృజనాత్మకతను, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో (ఏఐ) కళా పోటీలకు అవకాశం కల్పించారు. రీ ఇమాజిన్ చైన్నె ఏఐ ఆర్ట్ ఎగ్జిభిషన్‌గా జరగనున్న ఈ కార్యక్రమ వివరాలను బుధవారం సూపర్ చైన్నె ఎండీ రంజీత్ రాథోడ్ స్థానికంగా ప్రకటించారు. ఏఐ మేళవింపుతో చైన్నె భవిష్యత్తును ఊహించడం లక్ష్యంగా, నిరంతర అభివృద్ధిని కాంక్షిస్తూ స్కైలైన్ నుంచి శక్తి వంతమైన సంస్కృతి వరకు ఏఐ సాధానాల శక్తిగా వ్యక్తికరించే విధంగా జరగనున్న ఈ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వివరించారు. సెప్టెంబరు 30 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నామని, విశిష్ట ప్యానెల్ ద్వారా ఎంపిక చేసే టాప్ 25 కళాకృతులను ది ఏఐ ఆర్ట్ షోలో ప్రదర్శించడం జరుగుతుందని వివరించారు. దరఖాస్తులను, ఆవిష్కరణలను హెలో ఎట్ సూపర్ చైన్నె .కామ్‌కు పంపించాలని సూచించారు.
ఐదు చోట్ల ఈడీ దాడులు
సాక్షి, చైన్నె : చైన్నెలో బుధవారం ఉదయం నుంచి ఈడీ అధికారులు ఐదుచోట్ల సోదాలలో నిమగ్నమయ్యారు. ఇటీవల కాలంగా రాష్ట్రంలో ఎన్‌పోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు తరచూ ఎవరో ఒకర్ని టార్గెట్ చేసి సోదాలు నిర్వహిస్తూ రావడం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయాన్నే చైన్నెలో ఐదుప్రాంతాలను ఈడీ అధికారులు ఎంపిక చేసుకున్నారు. అడయార్, వేళచ్చేరి ,వెస్ట్ మాంబళం, మేడవాక్కం తదితర ఐదు చోట్ల పొద్దుపోయే వరకు సోదాలు జరిగాయి. ఈ నివాసాలను ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త బిష్ణోయ్ , ఓ ప్రముఖ వైద్యురాలు ఇందిరకి సంబంధించినవిగా విచారణలో వెలుగు చూశారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ సోదాలు నిఘా నీడలో జరుగుతున్నాయి.
మురుగు నీటి శుద్ధీకరణకు స్వదేశీ సాంకేతికత
– ఐఐటీ మద్రాసు ఆవిష్కరణ
సాక్షి, చైన్నె: దేశీయంగా తదుపరి తరం మురుగు నీటి శుద్ధీకరణ సాంకేతికతను ఐఐటీ మద్రాసు స్టార్టప్ జేఎస్‌పీ ఎన్విరో అభివృద్ధి చేసింది. ఈ వివరాలను బుధవారం ఐఐటీ మద్రాసు వర్గాలు ప్రకటించాయి. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని పరిశ్రమలలో ఈ పరిశోధనను విజయవంతంగా అమలు చేశారు. ఈ సాంకేతికత ప్రయోజనాలను లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందిన జెఎస్‌పీ ఎన్విరో సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ ప్రియదర్శిని మణి వివరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో మురుగునీటిని శుద్ధి చేసే సాంకేతికత ఇది అని పేర్కొన్నారు.
స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ విటీ ఫిదాల్‌కుమార్ పేర్కొంటూ, ప్రస్తుత సాంకేతికతలతో ఉన్న ముఖ్యమైన తేడాలను వివరించారు. సాంప్రదాయ ఏరోబిక్ వ్యవస్థలు మురుగు నీటిలోకి ఆక్సిజన్‌ను పంప్ చేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్‌ను వినియోగిస్తుందని పేర్కొన్నారు. అయితే ఈ దేశీయ సాంకేతికత బెడ్స్‌టీఎం ఆక్సిజన్ లేకుండా పనిచేస్తుందని, ఎలక్ట్రోడ్ భర్తీలు తరచూ అవసరం లేదన్నారు. బీఈఏడీఎస్(బెడ్స్) విద్యుత్, రసాయనాలను ఉపయోగించకుండా మురునీటిని శుభ్ర పరుస్తుందని వివరించారు. ఈరోడ్, పెరుందురైలలోని రెండు పారిశ్రామిక యూనిట్లలో విజయవంతంగా ఈ టెక్నాలజీ అమలు చేశామన్నారు.

మంతనాల్లో సెంగోట్టయన్ బిజీ