
పీఎంకే నుంచి అన్బుమణి బహిష్కరణ
కొడుకు కంటే పార్టీ ముఖ్యమన్న రాందాస్
అనుకున్నదే జరిగింది. తండ్రికొడుకుల పవర్ పాలిటిక్స్ తారా స్థాయికి చేరాయి. తనకు కంట్లో నలుసులా తయారైన సొంత కొడుకుపై ఎట్టకేలకు చర్య తీసుకున్నారు రాజకీయ కురువృద్ధుడు డాక్టర్ ఎస్ రాందాస్. పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీ నుంచి తన కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు.
విల్లుపురం జిల్లాలోని తైలపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. అన్బుమణిపై క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ 16 అభియోగాలు మోపిందని తెలిపారు. వివరణ కోరుతూ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు అన్బుమణి స్పందించలేదని, గడువు పొడిగించినా కూడా ఆయన నుంచి సమాధానం రాలేదన్నారు. షోకాజ్ నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఆయన వద్ద సరైన సమాధానాలు లేకపోవడం వల్లే అన్బుమణి స్పందించలేదని భావిస్తున్నామన్నారు. పార్టీ నియమ నిబంధనల ప్రకారం ఆయనను.. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిస్తున్నామని, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామని ప్రకటించారు. కొన్ని కారణాల వల్ల కొంత మంది తన కొడుకుతో చేతులు కలిపారని, వారంతా తాను తయారు చేసిన నాయకులేనని.. వారిని క్షమించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
కొత్త పార్టీ పెట్టుకో..
తన కుమారుడిని పీఎంకే నుంచి బహిష్కరించినా పార్టీకి ఎటువంటి నష్టం కలగబోదని రాందాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. పీఎంకే నుంచి తప్పించడంతో ఇప్పుడు అన్బుమణి సొంతంగా కొత్త పార్టీ (New party) పెట్టుకోవచ్చని సలహాయిచ్చారు. పీఎంకే తాను స్థాపించిన పార్టీ అని, దీనిపై తన కొడుకుతో సహా ఎవరికీ హక్కు లేదన్నారు.
ఆ నిర్ణయం చెల్లదు: బాలు
పీఎంకే పార్టీ నుంచి అన్బుమణిని బహిష్కరించడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు. రాందాస్ నిర్ణయం చెల్లదని అన్బుమణి మద్దతుదారుడు బాలు అన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. 'పార్టీ నిబంధనల ప్రకారం.. సభ్యులను తొలగించడం, సమావేశాలు నిర్వహించడం, ఏవైనా నిర్ణయాలు తీసుకోవడం వంటి అధికారం జనరల్ కౌన్సిల్ ద్వారా ఎన్నుకోబడిన అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. కాబట్టి, పార్టీ వ్యవస్థాపకుడు చేసిన ప్రకటన చెల్లద'ని ఆయన వాదించారు.
మామల్లపురంలో ఆగస్టు 9న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా అన్బుమణి, ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్, కోశాధికారిగా ఎం. తిలగబామ మరో ఏడాది కొనసాగేందుకు ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించామని వెల్లడించారు. పార్టీ అంతర్గత ఎన్నికలు వచ్చే ఏడాది ఆగస్టులో జరుగుతాయన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశం ప్రకారం అన్బుమణి రాందాస్ (Anbumani Ramadoss) పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, మిగతా వారి మాటలు నమ్మెద్దని మీడియాను బాలు కోరారు.
చదవండి: అన్నాడీఎంకే కలకలం.. రంగంలోకి అమిత్ షా!
ఏం జరగబోతోంది?
తాజా పరిస్థితుల నేపథ్యంలో పీఎంకే పార్టీలో ఏం జరగబోతోందనే చర్చ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తండ్రి నుంచి అన్బుమణి పార్టీ లాగేసుకుంటారా లేదా కొత్త పార్టీ పెడతారా అనేది చూడాలి. అన్బుమణి చర్యలను బట్టి చూస్తే ఆయన పార్టీని హస్తగతం చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు పార్టీని తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు రాందాస్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ పేరు, జెండా, చిహ్నంను రక్షించుకునేందుకు బుధవారం నాడు మద్రాసు హైకోర్టులో కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ తమదంటూ ఎవరైనా పిటిషన్ దాఖలు చేస్తే ముందుగా తన వాదనలు వినాలని, తన వివరణ తప్పనిసరిగా స్వీకరించాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు.