
తమిళనాట ఇప్పుడు ఫేస్ పాలిటిక్స్ నడుస్తోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి తాజా 'ముఖ' రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన ముఖం దాచుకున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటే, నేనెందుకు ఫేస్ కవర్ చేసుకుంటానని పళనిస్వామి కౌంటర్ ఇస్తున్నారు. పళనిస్వామి ముఖం దాచుకోవాల్సిన అవసరం లేదని మిత్రపక్షం కమలం పార్టీ అంటోంది. కమలనాథుల కనుసన్నల్లోనే అన్నాడీఎంకే పార్టీ నడుస్తోందని, అందుకే రహస్యంగా అమిత్ షాను పళనిస్వామి కలిశారన్న ఆరోపణలు పత్యర్థుల నుంచి విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ రాజకీయం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగింది?
ఢిల్లీలో మంగళవారం నాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు పళనిస్వామి. భేటీ ముగిసిన తర్వాత బయటకు వెళుతూ కారులో ముఖానికి కర్చీఫ్ అడ్డుపెట్టుకున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రత్యర్థులు ఆయనపై విరుచుకుపడ్డారు. తన ముఖం కనిపించకుండా కవర్ చేయడానికే కర్చీఫ్ అడ్డం పెట్టుకున్నారంటూ ఆరోపణలు చేశారు. సీఎం స్టాలిన్‌తో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) నేత టీటీవీ దినకరన్ (TTV Dinakaran) పలు ప్రశ్నలు సంధించారు. దినకరన్ ఒక అడుగు ముందుకేసి.. మాస్క్ పళనిస్వామి అంటూ ఎద్దేవా చేశారు.
అన్నామలై ఏమన్నారంటే..
ఈ వ్యవహారంపై బీజేపీ నాయకుడు కె అన్నామలై స్పందించారు. అమిత్ షా నివాసం నుంచి పళనిస్వామి ముఖం కప్పుకుని వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. గురువారం చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అధికారికంగా హోం మంత్రిని కలిసినందున అలాంటి అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, దినకరన్‌ను మళ్లీ ఎన్డీఏలోకి ఆహ్వానించనున్నట్టు అన్నామలై వెల్లడించారు. దీని గురించి ఆయనతో ఫోన్‌లో మాట్లాడానని, త్వరలో స్వయంగా కలిసి ఎన్డీఏలోకి ఆహ్వానిస్తానని తెలిపారు.
కర్చీఫ్‌తో ముఖం తడుచుకున్నా..
అమిత్ షా ఇంటి నుంచి వస్తూ తాను ముఖం దాచుకున్న వైరల్ కావడంతో పళనిస్వామి తన పార్టీ నేతలతో కలిసి గురువారం మీడియా ముందుకు వచ్చి వివరణయిచ్చారు. తాను ముఖం దాచుకోలేదని, ఇదంతా స్టాలిన్ అనుకూల మీడియా సృష్టి అని పేర్కొన్నారు. కర్చీఫ్‌తో ముఖం తడుచుకుంటున్న వీడియోతో రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖం దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, అధికారికరంగానే కేంద్ర హోంమంత్రిని కలిసినట్టు చెప్పారు.
చదవండి: సొంత పార్టీ నుంచి కొడుకును గెంటేసిన తండ్రి
అన్నాడీఎంకే పార్టీ వ్యవహారాల్లో బీజేపీ పెద్దల జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. తన గురించి మాట్లాడే అర్హత దినకరన్‌కు లేదని, ఒకప్పుడు ముసుగు వేసుకుని ఆయనే అన్నాడీఎంకేలోకి చొరబడ్డారని కౌంటర్ ఇచ్చారు. పళనిస్వామి (Palaniswami) వివరణతో ఫేస్ పాలిటిక్స్‌కు తెర పడుతుందా, లేదా అనేది చూడాలి.