
కర్ణాటక బ్యాంకులో ముసుగు దొంగల ఘాతుకం
తుపాకులు, కత్తులతో బెదిరించిన వైనం
విజయ్‌పురా (కర్ణాటక): ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు తుపాకులు, కత్తులతో సిబ్బందిని బెదిరించి ఓ బ్యాంకును లూటీ చేసి రూ.20 కోట్లకు పైగా దోచుకున్నారు. ఈ ఘటన కర్ణాటక విజయ్‌పురా జిల్లాలోని ఎస్‌బీఐకి చెందిన చాడ్‌చాన్ బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దుండగులు దోచుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువ రూ. 21 కోట్లకుపైగా ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు.
ముసుగు ధరించిన ముగ్గురు వ్యక్తులు కరెంటు ఖాతా తెరవాలంటూ బ్యాంకుకు వచ్చి మేనేజర్, క్యాషియర్, ఇతర సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారని పోలీసులు చెప్పారు. దుండగులు బ్యాంకు సిబ్బంది కాళ్లు, చేతులను కట్టేసి రూ.కోటికిపైగా నగదు, రూ.20 కోట్ల విలువైన 20 కేజీల బంగారు ఆభరణాలను దోచుకెళ్లినట్లు ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు పోలీసులు తెలిపారు. దుండగులు నకిలీ నంబర్ ప్లేటు ఉన్న సుజుకీ ఎవా అనే కారులో వచ్చారని విజయ్‌పురా ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి చెప్పారు. చోరీ అనంతరం దుండగులు మహారాష్ట్రలోని పండర్‌పూర్ వైపు పారిపోయినట్లు తెలిపారు.