breaking news
Pmk party
-
మిత్రపక్షాలు మోసం చేశాయి!
సాక్షి, చెన్నై(తమిళనాడు): అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలు చేసిన మోసంతో ఘోరంగా ఓటమిని చవి చూడాల్సి వచ్చిందని, ఇకనైనా వన్నియర్లు ఐక్యంగా సాగాలని పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమితో కలిసి ఎన్నికల్లోకి పీఎంకే వెళ్లిన విషయం తెలిసిందే. 23 స్థానాల్లో పోటీ చేసిన పీఎంకే ఐదు చోట్ల గెలిచింది. ఈ పరిస్థితుల్లో సేలంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాందాసు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తాను ప్రజాజీవితంలోకి వచ్చి 42 ఏళ్లు అవుతోందని, అయితే, తన సామాజిక వర్గానికి సరైన మార్గదర్శకం చేయలేదా..? అనే ఆవేదన కల్గుతోందన్నారు. వన్నియర్ సామాజిక వర్గం రెండు కోట్ల మంది ఉన్నారని గుర్తు చేస్తూ, ఐక్యంగా ఉండి ఉంటే, అధికారాన్ని శాసించే స్థాయిలో ఉండే వాళ్లమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లోని కొన్ని సామాజిక వర్గాలను చూసి ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉందని హితవు పలికారు. ఉద్యమాలతో 10.5 శాతం రిజర్వేషన్ దక్కించుకుంటే, కోర్టు రూపంలో అడ్డంకులు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒంటరిగా పోటీ చేసిన సమయంలో సామాజిక వర్గం అంతా తన వెన్నంటే ఉన్నట్టు గుర్తు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేక పోవడానికి కూటముల ఏర్పాటు విషయంలో తాను చేసిన తప్పిదం కూడా ఉన్నట్టు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అన్భుమణికి ఒక్క చాన్స్ ఎన్నికల్లో కనీసం 15 చోట్ల విజయకేతనం ఎగుర వేసి ఉండే వాళ్లమని, అయితే, కూటమిలోని మిత్ర పక్షాల నేతలు మోసం చేశారని అన్నాడీఎంకే కూటమిపై రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో ఉన్నా, సామాజిక వర్గం కోసం, ఆ అభ్యర్థి కోసం పాటు పడాల్సిన అవసరం ఉందని, అయితే, ఇక్కడ మోసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, మార్పు మార్గంగా ముందుకు వెళ్లనున్నామని, దయ చేసి అన్భుమణి రాందాసుకు ఒక్క చాన్స్ ఇవ్వాలని సామాజిక వర్గం నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్, పురపాలక ఎన్నికల్లో నైనా ఐక్యంగా సత్తా చాటుదామని , కొత్త మార్గంలో పయనిద్దామని, అన్భుమణిని ఆదరిద్దామని వారసుడికి నేతల మద్దతు కూడగట్టే పనిలో రాందాసు నిమగ్నం అయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు జికే మణి, ఎమ్మెల్యేలు అరుల్, సదాశివం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చదవండి: మాకు న్యాయం కావాలి.. పరిహారం కాదు! -
ముఖ్యమంత్రి అభ్యర్థిగా మీ ముందుకొచ్చా...
అవకాశం ఇవ్వండి...50 ఏళ్ల అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తా పీఎంకే పార్టీకి అధికారం ఇవ్వండి హొసూరు :50 ఏళ్ల అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపిస్తా, కేంద్రమంత్రిగా పలు దేశాలలో పర్యటించా, తనకు అవకాశమిస్తే రాష్ట్రాభివృద్ధికి కృషిచేస్తా ఆదరించండి అంటూ పీఎంకే పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడు, ధర్మపురి ఎం.పి. పీఎంకే పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రామదాస్ కోరారు. మీ ఊరు, మీ అన్బుమణి పేరుతో రాష్ట్రంలోని 32 జిల్లాలో పర్యటిస్తూ వివిద ప్రముఖులతో, పార్టీ నాయకులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. గురువారం ఉదయం జిల్లా కేంద్రం క్రిష్ణగిరి మీనాక్షి మహాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రాభివృద్దిపై, జిల్లా సమస్యలపై మాట్లాడారు. క్రిష్ణగిరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల, జిల్లా కేంద్రంలో రైల్వేస్టేషన్, జిల్లాలో సెజ్లను తీసుకువస్తానని, జిల్లాలో వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల పాలనలో క్రిష్ణగిరి జిల్లాలో ప్రాథమిక అవసరాలను కూడా తీర్చలేదని, ఈ రెండు ద్రవిడ పార్టీల వల్ల మంచి జరుగలేదని పేర్కొన్నారు. 50 ఏళ్ల ద్రవిడ పార్టీల పాలనలో అవినీతి, లంచగొండితనం వేళ్లూనిందన్నారు. మద్యం ఏరులైపారుతోందన్నారు. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం చేస్తామన్నారు. కేంద్ర మంత్రిగా దేశంలో పలు పథకాలను ప్రవేశపెట్టి దేశాధ్యక్షుల మన్ననలు పొందామని, ఇదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి మంచి పథకాలు రూపొందిస్తానని తెలిపారు. క్రిష్ణగిరి జిల్లాలో బడేదలావ్ చెరువు కాల్వ ఏర్పాటు చేసి అన్ని చెరువులకు నీరందిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని ఆరు మండలాలుగా విభజించి అభివృద్ధిని కేంద్రీకరణ చేస్తామని, నాణ్యమైన విద్య అందిస్తామని, రాష్ట్రంలో ఉచిత పథకాలను రద్దు చేస్తామని తెలిపారు. తమిళనాడుకు ద్రవిడ పార్టీల నుంచి మార్పు అవసరముందని, ప్రజలు మార్పును ఆశిస్తున్నారని సూచించారు. కార్యక్రమంలో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు జీ.కే.మణి తదితరులు పాల్గొన్నారు.