క్లుప్తంగా
రైలు పట్టాలపై ఇనుపు రాడ్డు
వేలూరు: తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేట సమీపంలోని రైలు పట్టాలపై ఇనుపు రాడ్డు ఉండటంతో వందేబారత్ రైలును కూల్చేందుకు ఎవరైనా ప్రయత్నం చేశారా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు.. కోవై నుంచి చైన్నెకి వందే భారత్ రైలు ఆదివారం ఉదయం జోలార్‌పేట మీదుగా వచ్చింది. జోలార్‌పేట సమీపంలోని తామలేరిముత్తు గ్రామం వద్ద వెళ్తున్న సమయంలో పట్టాలపై ఇనుపు రాడ్డు ఉండటాన్ని గమనించిన ఇంజిన్ డ్రైవర్ వెంటనే రైలును నిలిపి వేశాడు. రైలు ఉన్న ఫలంగా నిలిపి వేయడంతో అందులో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జోలార్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇనుపు రాడ్డును తొలగించి కేసు విచారణ చేస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి రైలు బయలుదేరి వెళ్లింది.
జనవరిలో 9 శాతం
వార్షిక వృద్ధి నమోదు
సాక్షి, చైన్నె : 2026 జనవరిలో 9 శాతం వార్షిక వృద్ధి నమోదు చేశామని జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా సోమవారం స్థానికంగా ప్రకటించింది. జనవరిలో 4,843 వాహనాలను వినియోగ దారుల ముంగిటకు తీసుకొస్తూ, 2025తో పోల్చితే 9 శాతం వృద్ధిని నమోదు చేశామని వివరించారు. ఎంజీ సెలక్ట్, సైబర్ స్టర్, ప్రెసిడెన్సియల్ లింబ్‌లు ఈ వృద్ధికి కారణంగా పేర్కొన్నారు. అలాగే, విండ్సర్ . హెక్టార్‌లు స్థిరమైన డిమాండ్‌ను ప్రదర్వించినట్టు ,వినియోగదారులకు ఉత్తమ అనుభవాలను అందించడానికి, , ఆటోమోటివ్ విభాగంలో స్మార్ట్ , స్థిరమైన పరిష్కారాలను అందించడానికి దృష్టి సారించామని పేర్కొన్నారు.
నులుగురిపై గూండా చట్టం
తిరువొత్తియూరు: తిరువళ్లూరు మణవాలనగర్‌లో జంట హత్య కేసులో టీవీకే నిర్వాహకుడితో సహా నలుగురిపై గూండా చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. ఒండికుప్పంలో జరిగిన 16వ తేదీ కనుమ పండుగ రోజు రాత్రి రోడ్డుపై అతివేగంగా ద్విచక్ర వాహనం నడపడాన్ని ప్రశ్నించినందుకు అదే ప్రాంతానికి చెందిన బ్యాంక్ ఉద్యోగి పార్తీబన్(32) అతని స్నేహితుడు సుకుమార్(31)లను గంజాయి మత్తులో ఉన్న నలుగురికి చెందిన ముఠా రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన నిర్వాహకుడు నీలకంఠన్ (30) మనవాలనగర్, కె.కె.నగర్ ప్రాంతానికి చెందిన అన్నా డీఎంకే నిర్వాహకుడి కుమారుడు, టీవీకే పార్టీకి చెందిన జవహర్(23) అదే ప్రాంతానికి చెందిన జ్యోతిష్ (34) వినోద్‌కుమార్ (36) అనే నలుగురిపై గూండా చట్టం కింద అరెస్ట్ చేయుటకు తిరువళ్లూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వివేకానంద శుక్లా సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ ఎం.ప్రతాప్ పైతెలిపిన నేరస్తులను అరెస్టు చేసేందుకు ఆదేశించారు.
హత్య కేసులో
ఇద్దరి అరెస్టు
కొరుక్కుపేట: కడలూరు సమీపంలో ఒక వృద్ధుడిని రాయితో కొట్టి హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కానీ తప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. కడలూరు ముదునగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సోనాంజవాడి గ్రామానికి చెందిన కుమార్(ఎ)భూమినాథన్(50) అనే వ్యక్తిని గత నెల 30వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన కేసులో ఇడలూరు ముదునగర్ పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. పోలీస్ ఇన్‌స్పెక్టర్ (ఇన్‌చార్జ్) చందూరు నేతృత్వంలోని పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ పరిస్థితిలో ఆదివారం సాయంత్రం 6 గంటలకు, సంగోలికుప్పం సమీపంలోని ఒక పనికిరాని బీరు కంపెనీ ప్రధాన ద్వారం సమీపంలోని పాత భవనంలో వారు దాక్కున్నారని పుదునగర్ ఇన్‌స్పెక్టర్ చందూరుకు రహస్య సమాచారం అందింది. దాని ఆధారంగా, పోలీసులు అక్కడికి వెళ్లి, వారిని అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేసి తీసుకువచ్చినప్పుడు, వారిద్దరూ పాత భవనం హ్యాండ్ రెయిల్‌ను పట్టుకుని తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఇద్దరూ కింద పడిపోయారు. సుధాకర్ కుడి కాలులో ఫ్రాక్చర్ అయింది. మరొకరు ముఖేష్ కుడి చేతిలో ఫ్రాక్చర్ అయింది. వారు కడలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.
వీఎంఆర్‌ఎఫ్‌తో
తురిబా వర్సిటీ ఒప్పందం
సాక్షి,చైన్నె : వినాయక మిషన్ పరిశోధనా ఫౌండేషన్(వీఎంఆర్‌ఎఫ్ డీయూ), లాట్వియాలోని తురిబా విశ్వవిద్యాలయం మధ్య అంతర్జాతీయ విద్యా భాగస్వామ్యం ఒప్పందం జరిగింది. ఈ మేరకు రెండు విశ్వవిద్యాలయాలు విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి, ఉమ్మడి విద్యా కార్యక్రమాలు, నాయకత్వ అభివృద్ధి, పరిశోధనలో భాగస్వామ్యం , అంతర్జాతీయ విద్యా అవకాశాల ఏర్పాట్లు వంటి రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించే విధంగా ముందుకెళ్లనున్నాయి. ఈ విద్యా ఒప్పందం వీఎంఆర్‌ఎఫ్ డీయూ చాన్స్‌లర్ డాక్టర్ ఏఎస్ గణేషన్ సమక్షంలో జరిగింది.


