ఆస్తిపన్ను బకాయిలపై కన్నెర్ర
సాక్షి, చైన్నె: ఆస్తి తదితర పన్నులు చెల్లించకుండా కాలం నెట్టుకు వస్తున్న వారిపై చైన్నె కార్పొరేషన్ కన్నెర్ర చేసింది. టాప్ 100గా పేర్కొంటూ వారి పేర్లను కార్పొరేషన్ వెబ్ సైట్‌లో జాబితాగా ప్రకటించింది. వివరాలు.. రాజధాని నగరం చైన్నె కార్పొరేషన్ పరిధిలో వివిధ రకాల పన్నుల వసూళ్లు అధికారులకు కష్టతరంగా మారాయి. మొండి బాకాయిల్ని వసూలు చేయడానికి వినూత్న పంథాలో పయనించాల్సిన పరిస్థితి తప్పడం లేదు. సకాలంలో ఆస్తి, నీటి, తదితర పన్నులను వినియోగదారులు చెల్లించేందుకు తగ్గ ఏర్పాట్లను కార్పొరేషన్ సులభతరం చేసింది. ఆన్‌లైన్ ద్వారా చెల్లింపు ప్రక్రియకు సైతం అవకాశాలు ఉన్నా, కొందరు పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారింది. దీంతో వీరి వద్ద ముక్కు పిండి మరీ బకాయిల వసూళ్లకు చర్యలు తీసుకుకోవాల్సి ఉంది. గతంలో బకాయి పెట్టిన బహుళ అంతస్తుల భవనాలు, సంస్థలు , కార్యాలయాల ముందు హిజ్రాల ద్వారా డ్యాన్సులు వేయించడం, డప్పుల హోరుతో వారి పరువు బజారుకీడ్చేదిశగా ముందుకు సాగడం వంటి ప్రయత్నాలను కార్పొరేషన్ వర్గాలు చేశాయి.
బకాయిదారుల పేర్ల వెల్లడి..
చైన్నె కార్పొరేషన్‌కు ప్రధాన ఆదాయ వనరులలో ఆస్తి పన్ను ఒకటి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుమారు 13 లక్షల మంది ఆస్తి యజమానుల నుండి ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. మొత్తం పన్ను ఆదాయంలో మూడింట రెండు వంతులు నివాస , వాణిజ్య భవనాల నుంచే వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్ రూ.1,800 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యాన్ని నిర్ధారించగా, మొదటి అర్ధవార్షిక కాలంలో రూ.1,300 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. అయితే రెండో అర్ధభాగంలో పన్ను వసూళ్లు మందగించాయి. ఎన్నికల సంబంధిత విధుల్లో రెవెన్యూ శాఖ సిబ్బంది నియామకం కావడంతో పూర్తి స్థాయిలో పన్ను వసూలు జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం అర్ధవార్షిక పన్ను వసూళ్లు సుమారు రూ.150 కోట్లుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంగా ఆస్తి పన్ను చెల్లించని వాణిజ్య భవనాల యజమానులపై కార్పొరేషన్ కఠిన చర్యలకు దిగింది. కోర్టు కేసులు లేని 100 మంది వాణిజ్య భవనాల యజమానుల పేర్లను ఆన్‌లైన్‌లో ప్రచురించి, వెంటనే పన్ను చెల్లించాలని కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. కార్పొరేషన్ రెవెన్యూ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ ఈ యజమానులపై లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఆస్తి పన్ను బకాయిలు ఉన్నాయని వివరించారు. మార్చి 31తో ఆస్తి పన్ను చెల్లింపు గడువు ముగియనుందని అప్పటివరకు పెండింగ్ పన్నును వసూలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పన్ను చెల్లించని వాణిజ్య, నివాస భవనాల యజమానులకు నోటీసులు పంపించడంతో పాటూ ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా సమాచారాలు పంపిస్తున్నామన్నారు.


