కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రాహుల్‌ చెంతకు రెబల్స్‌! | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రాహుల్‌ చెంతకు రెబల్స్‌!

Published Thu, Mar 17 2022 2:51 PM

Congress: Rebels Que For Sonia Rahul After Separet Meet - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వరుస ఓటములతో సతమతమవుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. తిరిగి జవసత్వాలు నింపే ప్రయత్నాలు మరో మలుపు తీసుకుంటున్నాయి. బుధవారం పద్దెనిమిది మంది రెబల్స్‌ నేతలు సమావేశమై ‘కలుపుగోలుగా ముందుకు వెళ్లే నాయకత్వం’ అంశంపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో జీ-23గా పిల్చుకునే నేతలు కొందరితోపాటు, యువ నేతలు సైతం పాల్గొన్నారు. ఈ తరుణంలో..

రెబల్‌ గ్రూప్‌ నుంచి నేతలు ‘గాంధీ’ కుటుంబ సభ్యుల దగ్గరికి క్యూ కట్టడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ పట్ల తమ విధేయతను ప్రస్తావిస్తూనే.. తమ అసంతృప్తిని వెల్లగక్కుతూ, తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఏకరువు పెట్టుకుంటున్నారు. గురువారం ఉదయం హర్యానా మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హూడా, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. హర్యానా కాంగ్రెస్‌ ఛీఫ్‌ పదవిని తనకి, తన తనయుడు దీపిందర్‌ హూడాకు ఇవ్వకుండా షెల్జా కుమారీకి ఇవ్వడంపై అసంతృప్తితో ఉన్నారు హుడా. షెల్జా, సోనియాగాంధీకి దగ్గర అయినందునే ఆమెకు పదవి కట్టబెట్టారని, అందుకే హర్యానా కాంగ్రెస్‌లో కుమ్ములాట కొనసాగుతోందని ఆయన రాహుల్‌కి వివరించినట్లు తెలుస్తోంది.

 

ఇదిలా ఉంటే..భూపిందర్‌ హూడా బాటలోనే మరికొందరు రెబల్స్‌.. సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీల అపాయింట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా నాయకత్వ మార్పుపైన జీ-23 నేతలు గట్టిగా గళం వినిపిస్తున్నారు. అయితే ఆ గ్రూప్‌ను రెబల్స్‌గా పరిగణిస్తూ.. దూరం పెడుతోంది అధిష్టానం. 

మరోవైపు ఐదు రాష్ట్రాల ఓటమి తర్వాత జరిగిన జీ-23 సమావేశంతో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ పోస్ట్‌ మార్టం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే ఓడిన ఐదు రాష్ట్రాల చీఫ్‌లను రాజీనామా సమర్పించమని కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియా గాంధీ కోరారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో మార్పుల కోసం ఐదుగురు నేతల పేర్లను సైతం ఆమె ప్రతిపాదించారు. అయితే ఆ నేతల వల్లే పార్టీ పతన స్థితికి చేరుకుందనేది రెబల్స్‌ ఆరోపణ. తమపై ఎలాంటి నిందలు వేసినా.. ఎలాంటి చర్యలు తీసుకున్నా పార్టీ కోసం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్‌ సీనియర్లు చెప్తున్నారు. ఇందుకోసం అధిష్టానంతో ఎన్నిసార్లు చర్చించేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement