
సీఎం రేవంత్ విసిరిన సవాల్‌కు స్పందించే క్రమంలో.. 72 గంటల డెడ్‌లైన్ విధిస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. మంత్రులు పొన్నం, సీతక్కతో పాటు పలువురు కీలక నేతలు కౌంటర్ ఇస్తున్నారు.
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు, సవాల్‌పై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. ‘‘కేటీఆర్ ఈ దేశంలో లేకపోవడం వల్ల మా సీఎం మాట్లాడింది తెలియనట్లు ఉంది. కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాస్తే అసెంబ్లీలో చర్చకు సిద్ధం అన్నారు. కానీ కేటీఆర్ శాసన సభ కాదని ప్రెస్ క్లబ్‌కు రావాలని సవాల్ చేస్తున్నారు. అక్కడకు చర్చకు పిలవాల్సింది మీరు కాదు. మీరు (కేటీఆర్) ఒక ఎమ్మెల్యే. కాబట్టి అసెంబ్లీలోనే చర్చకు రండి. అంతకంటే ముందు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ చేత ముందు చర్చ కోసం స్పీకర్‌కు రాయించండి.
సీఎం ఒక్క మాట మాట్లాడితే కేటీఆర్‌కు ఎందుకు అంత భయం?. మనం వీధుల్లో కోట్లాడుకునే వీధి మనుషులం కాదు. శాసన సభకు ఎన్నికైన ఎమ్మెల్యేలం. అక్కడే చర్చిద్దాం రండి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్‌కు అర్దం కానట్లు ఉంది. విదేశాలలో ఉన్న కేటీఆర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకుంటే మంచిది. అసెంబ్లీ లో చర్చిద్దాం అంటే.. ప్రెస్ క్లబ్‌కు రమ్మనడం ఏంటి?. డెడ్ అయిన పార్టీ(బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి..) డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉంది. నీ సొంత చెల్లే(కవితను ఉద్దేశించి).. నిన్ను నాయకునిగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడు(కేసీఆర్) అసెంబ్లీకి రాడా?. సమస్యల పై చర్చింద్దాం రా అంటే భయమెందుకు?.. అని అన్నారామె.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందిస్తూ.. కేటీఆర్ లండన్ లో బాగా రెస్ట్ తీసుకుని వచ్చి మళ్లీ రోస్టు మొదలుపెట్టారు. మా ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆడిపోసుకోవడమే ఆయనకు పనిగా మారింది. అక్కసు, కుళ్లు తప్ప కేటీఆర్ లో మాటల్లో ఏ మాత్రం పస లేదు. మా ప్రభుత్వ పనితీరుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. మా ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడైనా మేం చర్చకు సిద్దం.
ప్రజాస్వామ్యంలో చర్చకు చట్ట సభలున్నాయి. అక్కడ జరిగే చర్చలు రికార్డు అవుతాయి. అసెంబ్లీలో చర్చకు రాావాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా సవాల్ విసురుతున్నారు. కృష్ణా, గోదావరి జలాలతో పాటు అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్దం. దమ్ముంటే స్పీకర్ దగ్గరకు వెళ్లి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు కోరుతు మీ పార్టీ తరపున లేఖ ఇవ్వండి. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకువచ్చి చర్చ చేయమనండి అని అన్నారు.