మీ తీర్పు మీ ప్రతిష్ట పెంచుతుంది  | Sakshi
Sakshi News home page

మీ తీర్పు మీ ప్రతిష్ట పెంచుతుంది 

Published Thu, Nov 23 2023 4:10 AM

Congress Leader Mallikarjun Kharge On BJP And BRS - Sakshi

సాక్షి ప్రతినిధులు, మహబూబ్‌నగర్‌/నల్లగొండ: ‘తెలంగాణలో మీరు అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇక్కడి సీఎం కేసీఆర్‌ ఫాంహౌస్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలను కలవని ఆయనకు ఓట్లు వేయకూడదు. బీజేపీ, బీఆర్‌ఎస్, ఎంఐఎంలు స్నేహితులు. మూడూ ఒక్కటే. ఏ టీమ్, బీ టీమ్, సీ టీమ్‌గా ఉన్నాయి. కేసీఆర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ హెడ్‌క్వార్టర్‌ నాగపూర్‌కు వెళ్లినప్పుడు మోదీ తన మిత్రుడని చెబుతుంటాడు. అదే ఒవైసీ కేసీఆర్‌ తనకు మంచి స్నేహితుడని చెబుతాడు. ఈ ముగ్గురు కలిసి తెలంగాణలో కాంగ్రెస్‌ గెలవకూడదని కుట్రలు చేస్తున్నారు. దళిత, మైనార్టీ, నిరుపేదలంతా కాంగ్రెస్‌ వైపే ఉండడంతో ఆ మూడు పార్టీలకు కళ్లు మండుతున్నాయి.

కేసీఆర్‌ పాలనలో అంతులేని అవినీతి జరిగింది. ల్యాండ్, సాండ్, మైన్, వైన్‌ కుంభకోణాల మయంగా మారింది. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భాగస్వాములే. ఈ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. పేదల భూములు లాక్కున్న వారికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో పోరాడుతున్నాం. తెలంగాణలో అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి. మీ తీర్పు మీ కీర్తి ప్రతిష్టను పెంచుతుంది. దేశంలో మీకు గౌరవం లభిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలో కూడా గెలుస్తుంది..’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. బుధవారం నల్లగొండ, ఉమ్మడి పాలమూరులోని అలంపూర్‌ నియోజకవర్గ పరిధి అయిజల్లో నిర్వహించిన ప్రజాగర్జన సభల్లో ఆయన మాట్లాడారు.  

మేం భయపడతామనుకోవడం వాళ్ల భ్రమ 
‘కాంగ్రెస్‌కు సంబంధించిన నేషనల్‌ హెరాల్డ్‌తో పాటు మూడు హిందూ పత్రికలకు సంబంధించి రూ.780 కోట్ల ఆస్తిని మోదీ జప్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ గొంతుక, ప్రజల్లో చైతన్యం కోసం నెహ్రూ ఈ పేపర్లను తీసుకొచ్చారు. వీటి ఆస్తులను జప్తు చేస్తే.. తెలంగాణ ప్రజలు భయపడి బీజేపీ, కేసీఆర్‌కు ఓట్లు వేస్తారని భావించి రాజకీయ కుట్రకు తెరలేపారు. మా ఆస్తి జప్తు చేస్తే కాంగ్రెస్‌ పార్టీ భయపడుతుందని కేసీఆర్, బీజేపీ అనుకుంటే అది భ్రమనే. కాంగ్రెస్‌కు పోరాటం కొత్త కాదు. బ్రిటిష్‌ పాలకులకే భయపడలేదు. బీజేపీకి భయపడతామా? మోదీని ప్రజలు క్షమించరు..తరిమికొడతారు..’అని ఖర్గే అన్నారు. 

అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారు.. 
‘తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ ఇక్కడ అభివృద్ధి జరగలేదు. కేసీఆర్‌ తన పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల పాలు చేసి.. ఒక్కొక్కరిపై రూ.1.40 లక్షల అప్పు పెట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేసీఆర్‌ ప్రభుత్వం భర్తీ చేయలేదు. 20 లక్షల మంది నిరుద్యోగుల్లో ఏ ఒక్కరికీ ఇప్పటివరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. మోదీ 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పిస్తాం.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మరిచిపోయారు.

ప్రతి ఏడాదీ రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తాం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, ఎరువులు అందజేస్తానని ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే అని రుజువయ్యింది. కేసీఆర్, మోదీలు పేదల పక్షాన లేరు. ఢిల్లీలో ఉండే మోదీ, హైదరాబాద్‌ ఫాంహౌస్‌లో ఉండే కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటే. వీరు నిరుపేదలు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదు. అబద్ధాలతో మోసం చేస్తున్నారు..’అని ఆయన ఆరోపించారు. 

ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తాం.. 
‘రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తేవాల్సిన అవసరం ఉంది. ఇందిర దేశాన్ని ధాన్యాగారంగా మార్చారు. నల్లగొండలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కట్టింది కాంగ్రెస్‌ పార్టీయే.. ఆ నీటిని మొదట ఇందిరాగాం«దీయే విడుదల చేశారు. పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం, అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అలాంటి ఇందిరాగాందీని, గాంధీ కుటుంబాన్ని కేసీఆర్‌ విమర్శించడం ఎంతవరకు సమంజసం? సోనియా, రాహుల్, ప్రియాంక ప్రధాని పదవి కావాలని ఎప్పుడూ ఆశించలేదు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందిరమ్మ తరహాలో సంక్షేమ కార్యక్రమాలు చేపడతాం. ఆరు గ్యారంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం. మహిళకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తాం. రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు అందజేస్తాం. పంటలకు మద్దతు ధర, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షలు అందజేస్తాం.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం చేస్తాం. వృద్ధులకు పింఛన్లను రూ.4 వేలకు పెంచుతాం. విద్యార్థుల కోసం విద్యాభరోసా కార్డు అందజేస్తాం. వాల్మీకుల సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు సాగునీరు అందిస్తాం. పండిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. బీఆర్‌ఎస్, బీజేపీకి ఎవరూ భయపడొద్దు. కాంగ్రెస్‌ పార్టీ అందరికీ అండగా ఉంటుంది..’అని ఖర్గే హామీ ఇచ్చారు. 

మీకే 20 సీట్లు..చాలెంజ్‌: కోమటిరెడ్డి 
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని భువనగిరి ఎంపీ, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రజలను కోరారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలన్నారు. ‘కాంగ్రెస్‌కు 20 సీట్లు రావని సీఎం కేసీఆర్‌ అంటున్నారు.. చాలెంజ్‌ చేస్తున్నా.. మీకు ఈసారి 20 సీట్లు వస్తున్నాయి.. మాకు 90 సీట్లు వస్తున్నాయి..’అని పేర్కొన్నారు.  

కేసీఆర్‌ పాలనలో ప్రజలపై దండయాత్ర: విజయశాంతి 
పదేళ్ల కేసీఆర్‌ పరిపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణ ప్రజలపై దండయాత్ర జరిగిందని కాంగ్రెస్‌ నేత విజయశాంతి విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్‌ గద్దె దిగాల్సిందేనన్నారు. ఈ సభల్లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి సంపత్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement