ఇలా 'ట్రై' చేస్తే.. | CM Revanth Reddy, TPCC hold talks on 3 ways to conduct local elections | Sakshi
Sakshi News home page

ఇలా 'ట్రై' చేస్తే..

Aug 8 2025 12:51 AM | Updated on Aug 8 2025 12:51 AM

CM Revanth Reddy, TPCC hold talks on 3 ways to conduct local elections

ఢిల్లీలో ఇండియా కూటమి విందు కార్యక్రమంలో రాహుల్‌గాంధీతో సీఎం రేవంత్‌రెడ్డి

స్థానిక ఎన్నికల నిర్వహణకు 3 మార్గాలపై సీఎం, టీపీసీసీ మంతనాలు

సెప్టెంబర్‌ 30 గడువు ముంచుకొస్తుండటంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై నేతల సమాలోచనలు 

కేంద్రం నిర్ణయం కోసం మరికొంత కాలం వేచిచూడటమా? 

42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా జీవో ఇవ్వడమా?  

పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళ్లి పార్టీ పరంగా 42% అమలు చేయడమా? 

ఈ మూడు ఆప్షన్లపై జర్నలిస్టుల అభిప్రాయమూ కోరిన సీఎం రేవంత్‌ 

పార్టీ పరంగా రిజర్వేషన్ల వైపు ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే మొగ్గు!

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన కీలక బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ఎన్నికల విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సర్కారు, రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. 

తదుపరి తీసుకోవాల్సిన కార్యాచరణపై సీనియర్‌ నేతలు, అధిష్టాన పెద్దలతో పలుమార్లు చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌లు.. మూడు ఆప్షన్లు ముందు పెట్టుకొని సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాగా అధిష్టానం ఫైనల్‌ చేసే ఆప్షన్‌ ఆధారంగా ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ముమ్మరంగా మంతనాలు: స్థానిక ఎన్నికల్లో, విద్యా ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బుధవారం జంతర్‌ మంతర్‌ వేదికగా కాంగ్రెస్‌ మహాధర్నా నిర్వహించినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. 

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా  సురేఖ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్‌ రెడ్డిలతో గురువారం ఇక్కడ మంతనాలు జరిపారు. స్థానిక ఎన్నికలకు సంబంధించిన మూడు మార్గాలపై చర్చించారు. 

మూడు ఆప్షన్లు ఇలా..: 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రం నిర్ణయం చేసే వరకు వేచిచూడటం మూడు ఆప్షన్లలో మొదటిది కాగా.. 50 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన పాత జీవో ప్రకారం ఎన్నికలకు వెళుతూనే, కాంగ్రెస్‌ పార్టీ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం రెండోది. ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో జారీ చేయడం మూడోది. 

ఈ మూడు ఆప్షన్లకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అయితే రిజర్వేషన్లపై కేంద్ర నిర్ణయం వెలువడే వరకు వేచిచూస్తే,సెప్టెంబర్‌ 30లోగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అప్పుడు ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత గడువు కోరాల్సి ఉంటుంది. గడువు కోరేందుకు సహేతుక కారణాలు కూడా చూపాలి. 

అప్పుడైనా కోర్టు అంగీకరిస్తుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకమేనని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ కోర్టు అంగీకరించినా అప్పటివరకు స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, కేంద్రం నుంచి అందాల్సిన నిధులకు ఎదరయ్యే అవాంతరాలను కూడా అంచనా వేయాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నట్టు సమాచారం.  

జీవో ఇస్తే..కోర్టులకెళితే.. 
ఒకవేళ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇస్తే, దానిపై ఎవరు కోర్టులకెళ్లినా జీవో అమలు సాధ్యం కాదు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కంటి తుడుపుగా జీవో ఇచ్చారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాకాకుండా పాత జీవోలు అమలు చేస్తే బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయో కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 

ఈ నేపథ్యంలో ఒకవేళ పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా నిర్ణయం చేయాలన్నా..సొంత పార్టీలోనే అనేక అభ్యంతరాలు రావచ్చని కొందరు మంత్రులు అభిప్రాయపడినట్లు తెలిసింది. 

పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లపై తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ)లో చర్చించాల్సి ఉంటుందని, జిల్లాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పించడం, కొన్ని వర్గాల నేతలను ఒప్పించడం చాలా కీలకమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయని సమాచారం. 

కాగా బీసీ ధర్నా కవరేజీకి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జర్నలిస్టులు గురువారం ఉదయం తనను మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలోనూ ముఖ్యమంత్రి ఈ మూడు ఆప్షన్లపై చర్చ పెట్టి, అందులో ఏది మంచిదో సూచించాలని కోరడం గమనార్హం. 

రిజర్వేషన్ల అమలు ఆలస్యమైతే పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లతో ముందుకెళ్లాలనే సూచనలు రాగా, తాము అమలు చేసినా, ఇతర పార్టీలపై ఒత్తిడి తేవడం, వారిని ఒప్పించడం అంత సులువు కాదన్న తరహాలో సీఎం స్పందించినట్లు తెలిసింది.  

ఖర్గేతో మంతనాలు.. 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోనూ సీఎం రేవంత్‌ ఈ విషయమై భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఆయన కార్యాలయంలో మంత్రులు, ఎంపీలతో కలిసి ఆయనతో సమావేశమై.. మహాధర్నా విజయవంతమైన తీరును వివరించారు. ఇండియా కూటమి పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించిందని ఖర్గే దృష్టికి తెచ్చారు. 

రిజర్వేషన్లు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. ఒకవేళ కేంద్రం స్పందన లేనిపక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఆయన మార్గదర్శనం కోరారు. దీంతో పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలు కచ్చితంగా జరగాలనే అభిప్రాయాన్ని ఖర్గే వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.  

వచ్చే నెల 30 లోగా స్థానిక సమరం! 
– తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 
వచ్చే నెల 30వ తేదీలోగా గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్‌ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులపై ఏమీ తేలని నేపథ్యంలో..మూడు ఆప్షన్లు పరిశీలిస్తున్నా.. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. 

గ్రామపంచాయతీ పాలకమండళ్ల గడువు ముగిసి ఏడాదిన్నరకు పైగా, మండల, జిల్లా పరిషత్‌ల కాలపరిమితి పూర్తయి ఏడాదికి పైగా కావడంతో...కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం గ్రాంట్‌లు, ఇతర పథకాల కింద వచ్చే నిధులు ఆగిపోయాయి. తద్వారా గ్రామీణ స్థానిక సంస్థల్లో అభివృద్ధి కుంటుపడింది. 

ఈ నేపథ్యంలో ఈ సంస్థల పనితీరును చక్కదిద్దడంతో పాటు, గ్రామ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గాడిలో పెట్టడం, కోర్టు గడువు దృష్ట్యా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. 

రాజకీయపార్టీ గుర్తులపై జరిగే మండల, జిల్లా పరిషత్‌ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు) ఎన్నికలను ముందుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమౌతున్నట్టుగా అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. అవి ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్టు సమాచారం. 

8వ తేదీలోగా ఓటర్ల తుది జాబితా 
ఈ నెల 8వ తేదీలోగా గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాలను (అసెంబ్లీ ఓటర్ల లిస్ట్‌ల ఆధారంగా) రూపొందించాలని జిల్లా కలెక్టర్లను పంచాయతీరాజ్‌ శాఖ ఆదేశించింది. దీనికి సంబంధించి గ్రామపంచాయతీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను గ్రామ కార్యదర్శులు సరిపోల్చి సిద్ధం చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలను మండల అభివృద్ధి అధికారులు (ఎంపీడీవోలు), మండల పంచాయతీ అధికారులు (ఎంపీవోలు) పరిశీలించి పంపించాలని అధికారులకు  పీఆర్‌శాఖ స్పష్టం చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement