CM KCR Order To Karimnagar BRS MLAs To Stay in Constituencies - Sakshi
Sakshi News home page

Karimnagar: ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రావొద్దమ్మా.. కేసీఆర్‌ ఆదేశాలు?

Published Sat, Feb 25 2023 1:41 PM

Cm KCr Order To Karimnagar BRS MLAs To Stay In Constituencies - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా.. తెలంగాణ ఉద్యమానికి బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టుకొమ్మగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఎత్తుకున్నప్పటి నుంచి నేటి వరకు జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ప్రదర్శిస్తున్నారు. 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ 13 స్థానాలకు గాను, 12 చొప్పున అసెంబ్లీ స్థానాలు సాధించి బలాన్ని చాటుకుంది. ఇప్పుడు కూడా పూర్వపు తరహాలోనే మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవాలని పార్టీ స్పష్టమైన ఆదేశాలు పంపింది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మంత్రులు మినహా మిగిలిన ఎమ్మెల్యేలంతా వారంలో కనీసం ఆరురోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. మిగిలిన ఎమ్మెల్యేలు అత్యవసరమైతే తప్ప.. ఇకపై నుంచి చీటికి మాటికి రాజధానికి రావాల్సిన అవసరం లేదని, నియోజకవర్గపు సమస్యలపై దృష్టి సారించాలని స్పష్టంచేసినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన దరిమిలా.. ఈ మేరకు అందరు ఎమ్మెల్యేలకు సీఎం, పార్టీ అధిష్టానం నుంచి సందేశం అందినట్లు సమాచారం. 

ఎమ్మెల్యేలపై నిరంతర నిఘా..!
పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ జిల్లాపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్టు సమాచారం. అందులో భాగంగా ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? స్థానికంగా ప్రజలకు ఎన్నిరోజులు అందుబాటులో ఉంటున్నారు? హైదరాబాద్‌లో ఎన్నిరోజులు ఉంటున్నారు? అన్న విషయాలపై నిరంతరం సమాచారం తెప్పించుకుంటున్నారు. వీటి ఆధారంగా వాటి పనితీరును ఆయన బేరీజు వేస్తున్నారని తెలిసింది.

ఇటీవల సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్‌ కూడా ఉమ్మడి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. గతవారం కొండగట్టు మాస్టర్‌ ప్లాన్‌ సందర్భంగా స్మితా సభర్వాల్‌ ఒకరోజు ముందే వచ్చారు. తాజాగా కరీంనగర్‌లో జరుగుతున్న తీగలవంతెన, ఎంఆర్‌ఎఫ్, స్మార్ట్‌సిటీ అభివృద్ధి కార్యక్రమాలను ఆమె పరిశీలించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటలిజెన్స్, పార్టీ, ఇతర వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సీఎంవోకు రిపోర్టు అందుతూనే ఉంది. అందుకు అనుగుణంగా సీఎం నుంచి తగిన సూచనలు, సలహాలు వసూ్తనే ఉన్నాయి. 

అన్ని పార్టీలు వస్తున్న క్రమంలో..!
రాష్ట్రంలో పాత కరీంనగర్‌కు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక్కడ పాగా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు సీపీఐ, బీఎస్పీ, వైఎస్సార్‌ టీపీ తదితర పార్టీలు కొంతకాలంగా ప్రయత్నాలు సాగి స్తున్నాయి. తాజాగా వీటికి తోడుగా ఎంఐఎం కూడా చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం చేసిన పనులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ.. పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని సీఎం నుంచి సీనియర్‌ లీడర్ల ద్వారా ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యర్థి పార్టీల సంఖ్య, రాజకీయ పోటీ పెరుగుతున్న దరిమిలా.. నిరంతరం ఎమ్మెల్యేలంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించినట్లు సమాచారం. 

ఇప్పటికే మొదలు..
జిల్లాలో మంత్రి కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌ ప్రభుత్వ పరంగా జిల్లాల్లో వరుస సమావేశాలతో బిజీగా ఉంటున్నారు. అటు కేబినెట్‌ ఇటు జిల్లా కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 13 సమావేశాల్లో హుజూరాబాద్, మంథని మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు అధికార పార్టీ గెలిచింది. సీఎం ఆదేశాలతో దాదాపుగా ఎమ్మెల్యేలంతా స్పీడు పెంచారు.

►జగిత్యాల: డా.సంజయ్‌కుమార్‌ పల్లె నిద్రపేరుతో గ్రామాల్లో నిద్రిస్తున్నారు.
►కోరుట్ల: విద్యాసాగర్‌రావు లబ్ధిదారులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
►ధర్మపురి: ఈశ్వర్‌ నిరంతరం జిల్లా సమీక్షలు, లబ్ధిదారులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. 
►సిరిసిల్ల: కేటీఆర్‌ వేములవాడ మాస్టర్‌ప్లాన్‌ జిల్లాపై సమీక్షలు..
►వేములవాడ: రమేశ్‌ కొద్దికాలంగా పెరిగిన పర్యటనలు. 
►కరీంనగర్‌: గంగుల కమలాకర్‌ తీగల వంతెన, ఎంఆర్‌ఎఫ్, స్మార్ట్‌సిటీ పనులపై సమీక్ష
►చొప్పదండి: రవిశంకర్‌ కొండగట్టు మాస్టర్‌ప్లాన్‌తో పెరిగిన స్పీడు..
►మానకొండూరు: బాలకిషన్‌ పల్లెల్లో మార్నింగ్‌ వాక్‌లకు ప్లాన్‌
►పెద్దపల్లి: మనోహర్‌రెడ్డి నిత్యం లబ్ధిదారులతో సమావేశాలు
►రామగుండం: చందర్‌ నిరంతరం సేవా, వసతుల కల్పనపై సమీక్షలు
 ►హుస్నాబాద్‌: సతీశ్‌బాబు స్థానిక సమస్యలపై ప్రజలతో సమావేశాలు. 

Advertisement
Advertisement