60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం ఒరగబెట్టింది.. మరో చాన్స్‌ ఎందుకివ్వాలి? | CM KCR Fires On Congress Party At Husnabad Public Meeting | Sakshi
Sakshi News home page

60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం ఒరగబెట్టింది.. మరో చాన్స్‌ ఎందుకివ్వాలి?

Oct 16 2023 1:39 AM | Updated on Oct 16 2023 6:46 PM

CM KCR Fires On Congress Party At Husnabad Public Meeting - Sakshi

ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, సిద్దిపేట/ హుస్నాబాద్‌: ‘‘కొన్ని పార్టీలు వచ్చి తమకు ఒక్క చాన్స్‌ ఇవ్వాలని అడుగుతున్నాయి. కానీ ప్రజలు ఇప్పటికే పది చాన్సులు ఇచ్చారు కదా.. 60ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీయే రాజ్యమేలింది కదా.. ఏం ఒరగబెట్టారు? వారికి ఇంకో చాన్స్‌ ఎందుకివ్వాలి?’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు ఇంకా ఇంత దుస్థితిలో ఉన్నారంటే.. 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకుని ఉన్నదంటే సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్యానించారు.

60, 70 ఏళ్ల కిందే దళితబంధు వంటి పథకాన్ని ప్రారంభించి ఉంటే.. ఇవాళ దళితుల్లో పేదరికం ఉండేదా అన్నది ఆలోచించాలని పేర్కొన్నారు. ఇవాళ ఎవరు ఒక్క చాన్స్‌ అడుగుతున్నారో.. వాళ్లకు 10, 12 చాన్సులు ఇచ్చినా ఏమీ  చేయలేదని, వారి విధానాల లోపమే ప్రస్తుత దుస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే.. 

‘‘సభలో చెప్పిన మాటలు ఇక్కడే విడిచిపెట్టి పోవద్దు. మీ పట్టణం, గ్రామానికి, తండాకు వెళ్లిన తర్వాత కేసీఆర్‌ చెప్పినదాంట్లో నిజమెంత, అబద్ధమెంత అనేది ఆలోచించాలి. ఎన్నికలు చాలా వస్తాయి పోతాయి. కానీ ప్రజలు ఆగమాగం కావద్దు. రాయి ఏదో, రత్నమేదో ఆలోచించాలి. మనకు పనికొచ్చేది ఏదో గుర్తుపట్టాలి. ‘తీర్థం పోతాం సమ్మక్క అంటే నేను కూడా వస్తా రామక్క..’ అన్నట్టు అలవోకగా ఓటేయొద్దు. బామ్మర్ది చెప్పాడనో, మా మేనమామ చెప్పాడనో ఓట్లు వేయొద్దు. స్పష్టంగా ఆలోచించి ఓట్లు వేయాలి. 

మేధో మథనం చేసినం.. మెదడు కరగదీసినం 
తొమ్మిదిన్నరేళ్ల కింద తెలంగాణలో ఎక్కడ చూసిన భయమయ్యే పరిస్థితి ఉండేది. వలసలు, కరువు.. సాగునీరు లేదు.. మంచినీళ్లు లేవు.. కరెంటు లేదు.. ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కొత్తకుండలో ఈగ సొచ్చినట్టు.. కొత్త సంసారం. ఎక్కడ మొదలుపెట్టాలి? ఏవిధంగా పైకి తీసుకెళ్లాలి?ప్రజానీకాన్ని ఎలా ఆదుకోవాలనే సమస్య ఉండేది.

తెలంగాణ వచ్చాక ప్రజలు బీఆర్‌ఎస్‌ మీదనే బాధ్యత పెట్టడంతో.. ఆర్థిక నిపుణులతో రెండు మూడు నెలల పాటు మేధోమథనం చేసినం. మెదడు కరగదీశాం. ఇప్పుడు అన్నిరంగాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం, విద్యుత్, సాగు, తాగునీటిలో, పచ్చదనం, పంచాయతీరాజ్‌ వ్యవస్థ, పారిశ్రమిక విధానం అమలులో టాప్‌గా మారింది. 

ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిచ్చాం.. 
కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించింది. భూగర్భ జలాలు కూడా పెరిగి వ్యవసాయానికి స్థిరత్వం వచ్చింది. కడుపు నిండా కరెంట్‌.. కల్లాల నిండా వడ్లు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు కాలిపోయేవి. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్‌ అందిస్తుండటంతో మోటార్లు కాలడం లేదు.

రైతులు కంటి నిండా నిద్ర పోతున్నారు. ఒకప్పుడు హుస్నాబాద్‌ కరువు ప్రాంతం. గతంలో హుస్నాబాద్‌ వాగుపై ఒక్క చెక్‌డ్యాం ఉండేది కాదు. నీళ్లుండేవి కాదు. ఇవాళ హెలికాప్టర్‌లో వస్తుంటే.. వాగుపై వరుసగా మూడు చెక్‌డ్యాంలు, వాటిలో నిండా నీళ్లు, కనుచూపు మేర పచ్చని పంటపొలాలు కనిపించాయి. కేంద్ర సహకారం లేకున్నా, ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు కుట్రలు చేసినా.. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు చేసుకున్నాం. ఎన్నికల తర్వాత మూడు నాలుగు నెలలు కష్టపడితే అది పూర్తయి లక్ష ఎకరాలకు నీళ్లు అందుతాయి. 

హుస్నాబాద్‌తో గెలుపునకు నాంది 
2018లో ఎన్నికల ప్రచారం కోసం హుస్నాబాద్‌కే వచ్చా, ఈ గడ్డ ఆశీర్వాదంతో 88 సీట్లతో విజయం సాధించాం. ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చి హుస్నాబాద్‌ నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించి, ఆశీర్వాదం కోరడానికి వచ్చా. హుస్నాబాద్‌ గెలుపు.. బీఆర్‌ఎస్‌ పార్టీ 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు నాంది కావాలి. ఇవాళ అనేక విషయాల్లో దేశానికి ఆదర్శం అయ్యాం, మళ్లీ గెలిపిస్తే దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాం. ఎమ్మెల్యే సతీశ్‌బాబు 50– 60వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుస్తారని నమ్మకం ఉంది..’’ అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

గొంతు గరగరతో సీఎం ప్రసంగం 
ఇటీవల సీఎం కేసీఆర్‌ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. హుస్నాబాద్‌లో సభలో ఆయన గొంతు గరగరతోనే ప్రసంగించారు. మధ్య మధ్యలో గొంతును సరిచేసుకుంటూ 21 నిమిషాల పాటు మాట్లాడారు. హుస్నాబాద్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సతీశ్‌కు సభ వేదికపైనే పార్టీ బీఫారంను కేసీఆర్‌ అందజేశారు. సభలో బీఆర్‌ఎస్‌ సెక్రెటరీ జనరల్‌ కేశవరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ దేశపతి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
మా మేనిఫెస్టోతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు: హరీశ్‌రావు 
సీఎం కేసీఆర్‌ విడుదల చేసిన బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను చూసి ప్రజల హృదయాలు ఉప్పొంగిపోతుంటే.. మరోవైపు ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. హుస్నాబాద్‌ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ హుస్నాబాద్‌ నుంచి ప్రచారం ప్రారంభిస్తే 88 సీట్లతో విజయం సాధించామని గుర్తు చేశారు.

మళ్లీ ఇక్కడి నుంచే బీఆర్‌ఎస్‌ ప్రచారం ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇక్కడి ఎల్లమ్మ దయతో ఈసారి సెంచరీ సాధించి తీరుతామన్నారు. సీఎం కేసీఆర్‌ ఏ మాటిచ్చినా తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సీఎం అయ్యేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement