కేసీఆర్‌ది కుటుంబ పాలన... నాది సామాజిక పాలన | CM Revanth Reddy Comments On KCR At Parakala, Mulugu Sabha | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ది కుటుంబ పాలన... నాది సామాజిక పాలన

Aug 17 2026 1:23 AM | Updated on Aug 17 2026 1:23 AM

CM Revanth Reddy Comments On KCR At Parakala, Mulugu Sabha

సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు తులాభారంతో బంగారం సమర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొంగులేటి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, పాయం వెంకటేశ్వర్లు, బలరాం నాయక్, రాంచంద్రు నాయక్, వేం నరేందర్‌రెడ్డి

ములుగు, పరకాల సభల్లో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మా ప్రభుత్వంలో ఆడబిడ్డలు, ఉద్యమకారులకు అవకాశాలు 

కుటుంబ పాలనకు.. ప్రజా పాలనకు తేడా ఇదే  

సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం 

రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే మా ఎజెండా 

సామాజిక న్యాయం మా నైజం.. 

సెప్టెంబర్‌లో అసెంబ్లీ పెడతా.. అన్ని లెక్కలు అక్కడ మాట్లాడతాం 

2029లో రెట్టింపు మెజారిటీతో గెలిపించండి  

పరకాల, ములుగు సభల్లో ప్రసంగించిన ముఖ్యమంత్రి

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: ‘కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే ఆయన కుటుంబానికే లాభం.. నేను ముఖ్యమంత్రి అయితే ప్రజలకే లాభం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులకే పదవులు దక్కాయని.. తమ ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలు, ఉద్యమకారులు, సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని ములుగు, పరకాలలో ఆదివారం నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ‘ప్రజా పాలన–ప్రగతి బాట’ బహిరంగ సభల్లో సీఎం ప్రసంగించారు. ‘రక్తం పంచుకుని పుట్టకపోయినా సీతక్కను ఆడబిడ్డగా గౌరవిస్తున్నా. ఇంకోవైపు రక్తం పంచుకుపుట్టిన సోదరిని ఆస్తికోసం ఇంటి నుంచి పంపించారు. సలాక కాల్చి కొడుక్కి బుద్ధి చెప్పాల్సిన తండ్రి ఫామ్‌హౌస్‌­లో పడుకున్నాడు. వీళ్లు తెలంగాణ ఆడబిడ్డలకు మేలు చేస్తారా? సొంత చెల్లికి న్యాయం చేయని కేటీఆర్‌ రెండు కోట్ల మంది అక్కాచెల్లెళ్లకు మేలు చేస్తారా?’ అని రేవంత్‌ ధ్వజమెత్తారు.  

కేసీఆర్‌కు... నాకు తేడా అదే.. 
కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కేటీఆర్, హరీశ్‌రావులను మంత్రులను చేశారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. తాను సీఎం అయిన తర్వాత సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చానన్నారు. కేసీఆర్‌.. ఎర్రబెల్లి దయాకర్‌రావుకు మంత్రి పదవి ఇస్తే.. తాను అడ్లూరి లక్ష్మణ్‌కు అవకాశం కల్పించానన్నారు. కేసీఆర్‌ తన కుమార్తెను ఎంపీగా, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా చేశారని.. తాను కావ్యను ఎంపీగా, యశస్వినిని ఎమ్మెల్యేగా చేశానని చెప్పారు. కేసీఆర్‌ సడ్డకుని కొడుకు సంతోష్‌రావును ఎంపీని చేస్తే.. తాను మిత్రధర్మంతో వేం నరేందర్‌రెడ్డికి రాజ్యసభ అవకాశం ఇచ్చానన్నారు. ఓడిపోయిన బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌కు ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌చైర్మన్‌ పదవి ఇస్తే.. తాను ఉద్యమకారుడు కోదండరాంను ఎమ్మెల్సీగా చేశానన్నారు. కేటీఆర్‌ను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చేస్తే.. తాను మహేశ్‌కుమార్‌ గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేశానని చెప్పారు.  

వచ్చే నెల్లో అసెంబ్లీ పెడతా... 
‘అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని బావా, బావమరదులు అడుగుతున్నారు. సెప్టెంబర్‌లో సమావేశాలు పెడతా. కేసీఆర్‌ను కూడా తీసుకొని రండి అక్కడే అన్నీ మాట్లాడుదాం’ అని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి లాభం జరిగిందో లెక్కలతో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 2029 ఎన్నికలకు ఇప్పటినుంచే రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నట్లు రేవంత్‌ సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా ప్రభుత్వానికి రెట్టింపు మెజారిటీ ఇవ్వాలని కోరారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎంతమంది కేసీఆర్‌లు వచ్చినా తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.   

ఇందిరమ్మ రాజ్యం 
సమ్మక్క–సారలమ్మ ఆశీస్సులతోనే తాను ములుగునుంచి పాదయాత్ర ప్రారంభించానని రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర నలుమూలలా ప్రతీ గూడెం, పల్లెకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చామని, ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. ఆదివాసీ బిడ్డలు కష్టానికి మారుపేరని, వారి కష్టాలు తీరాలంటే ములుగు ప్రాంతానికి సాగునీరు అందాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమని సీఎం చెప్పారు. ప్రతి ఆరు నెలలకు ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తామని ప్రకటించారు. ‘ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మాది.. పరీక్షలకు సిద్ధం కావాల్సిన బాధ్యత మీది’ అని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. జంపన్నవాగును నూటికి నూరు శాతం అభివద్ధి చేస్తామని ప్రకటించారు. గత పాలకులు బతుకమ్మ చీరల్లో కమీషన్‌ నొక్కి ఫాంహౌస్‌లో పడుకుంటే.. సారె పేరు మీద ఆడపడుచులకు పాలపిట్ట చీరలు అందించామన్నారు. ఈ డిసెంబర్‌లో ప్రతీ ఆడబిడ్డకు చిలకపచ్చ చీరలు అందిస్తామన్నారు. పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా వరంగల్‌ జిల్లా ఎప్పుడూ చైతన్యం ప్రదర్శించిందని సీఎం అన్నారు.   

మీరు అండగా ఉంటే ఏమైనా చేస్తా.. 
ప్రజలు ఇబ్బందులు పడాలని కొందరు కోరుకున్నారని, అఘోరా పూజలు చేశారని వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌.. దేవుడు తమవైపే ఉన్నాడని, వర్షాలు కురిపించాడని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం.. మన సమస్యల్ని మనమే పరిష్కరించుకుందాం’ అని అన్నారు. ములుగు, పరకాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్, ఎంపీలు వేం నరేందర్‌ రెడ్డి, డా.కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌ రెడ్డి, కేఆర్‌ నాగరాజు, మామిడాల యశస్విని, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ సిరిసిల్ల రాజయ్య, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: మంత్రి పొంగులేటి 
పేదల సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పరకాల నియోజకవర్గంలో రూ.400 కోట్లకు పైగా అభివద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. దశాబ్దాల వరంగల్‌ ప్రజల కల మామునూరు విమానాశ్రయాన్ని సాకారం చేస్తున్నామని, రాబోయే రెండేళ్లలో విమానాశ్రయం పూర్తి చేసి సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరంగల్‌లో సుమారు రూ.5,700 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.   

సంక్షేమం, సామాజిక న్యాయమే: మహేశ్‌ గౌడ్‌ 
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయానికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత సమర్థంగా అందించేందుకు 1.06 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. సమగ్ర సామాజిక, కుల సర్వే ద్వారా అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి సామాజిక న్యాయం దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement