జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. కౌరవ సైన్యంపై యుద్ధానికి సిద్ధమా? | Sakshi
Sakshi News home page

ఏలూరు సిద్ధం సభ: జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు.. కౌరవ సైన్యంపై యుద్ధానికి సిద్ధమా?

Published Sat, Feb 3 2024 4:01 PM

CM Jagan Speech At YSRCP Denduluru Siddham Public Meeting - Sakshi

ఏలూరు, సాక్షి: ఎన్నికల రణ క్షేత్రంలో మీది కృష్ణుడి పాత్ర అయితే..  నాది అర్జునుడి పాత్ర అని ముఖ్యమంత్రి దెందులూరు సిద్ధం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ఆ ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారాయన. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి తరలి వచ్చిన పార్టీ కేడర్‌ను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా?. ఇంటింటి చరితను.. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మరోసారి మీరంతా సిద్ధమేనా?  అని సీఎం జగన్‌ కేడర్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. పేదల భవిష్యత్తులను, పేదల్ని కాటేసే యెల్లో వైరస్‌ మీద.. కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయంపై సంగ్రామానికి ప్రతీ ఒక్కరూ సిద్ధమేనా? అని సీఎం జగన్‌ ప్రసంగించారు.

రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు చంద్రబాబు అండ్‌ కో రూపంలో ఉన్నారు. ఓ చంద్రబాబు రూపేణా, ఓ ఈనాడు రూపేణా, ఓ ఆంధ్రజ్యోతి రూపేణా, ఓ టీవీ5 రూపేణా, ఓ దత్తపుత్రుడి రూపేణా, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టులు.. ఇంత మంది తోడేళ్లందరూ కూడా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని రెడీగా ఉన్నారు.  వాళ్లు.. ఆ తోడేళ్ల మంద వైపు నుంచి చూస్తే ఈ సీన్‌ చూస్తుంటే జగన్‌ ఒంటరి వాళ్లలా కనిపిస్తాడు. కానీ, నిజం ఏంటంటే.. ఇక్కడ జగన్‌ ఏనాడూ ఒంటరి కాదు. నిజం ఏమిటి అంటే ఇక్కడ కనిపిస్తున్నది నిజం. ఇదీ అసలు సీను.  ఇన్ని లక్షల హృదయాల్లో కోట్ల మంది హృదయాల్లో మీ జగన్ మీ గుండెల్లో మీరు స్థానం ఇచ్చి మీ ఇంటి బిడ్డగా మీ జగన్ మీ గుండెల్లో ఉండటం.. ఇదీ నిజం.  వారికి ఉన్న సైన్యం వారి పొత్తులు అయితే.. వారి యెల్లో పత్రికలైతే.. వారి యెల్లో టీవీలు అయితే.. నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం.. పైనున్న దేవుడు.. ఈ ప్రజలు అని సీఎం జగన్‌ భావోద్వేగంగా పేర్కొన్నారు.

ఇది నాయకుడి మీద నమ్మకం నుంచి పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారంటే.. ప్రజల ప్రేమ ఎలా ఉంటుందో అనేందుకు ఇదే నిదర్శనం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణావతారంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరూ(ప్రజలు).. అర్జునుడిని నేను, చేసిన మంచినంతా అస్త్రాలుగా మల్చుకుని కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దామంటూ పిలుపు ఇచ్చారు. జరగబోయే ఎన్నికల యుద్ధంలో వారి దాడి ఎవరి మీద అంటే.. మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి మీద, అభివృద్ధి మీద.

 చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు మీకోసం ఏం చేశాడు? ఏనాడైనా ఒక్క రూపాయి అయినా వేశాడా? అని దెందులూరు సిద్ధం వేదిక నుంచి ప్రతిపక్ష నేతను సీఎం వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ‘‘నా మాటలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి. మీ గ్రామాల్లో ఇళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంట్లో అడగండి.. 1995లో సీఎం అయిన చంద్రబాబు.. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు.. మీ ఇంటికి గానీ, మీ ఊరికి గానీ, మీ సామాజికవర్గానికి గానీ, మీ కుటుంబ భవిష్యత్ కు గానీ ఏం చేశాడు అని అడగండి. అదే పేద కుటుంబాన్ని అడగండి. గత 10 ఏళ్లుగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందో అడగండి. చంద్రబాబు పాలనలో పేద కుటుంబానికి బ్యాంకు అకౌంటుకు ఇచ్చింది ఎంత అని అడగండి. వారిని నిలబెట్టేలా అందించిన స్కీములు చంద్రబాబు హయాంలో ఏమున్నాయి అని అడగండి. బాబు పాలనలో ఏనాడైనా ఒక్క రూపాయి అయినా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడగండి. 1994లో గానీ, 1999లో గానీ, 2014లో గానీ చంద్రబాబు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడైనా 10 శాతం అయినా అమలు చేశాడా అని ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు, అవ్వాతాతలను అడగండి. 

మరోవంక.. మీ జగన్ పాలన, మీ బిడ్డ పాలన చూడండి అని మళ్లీ అడగండి. ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ ఏం చేశాడో కొన్ని అంశాలను వివరిస్తా. ఈ తేడాను ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామమైనా తీసుకోండి. ఏ పట్టణాన్ని తీసుకున్నా ఆ గ్రామానికి వెళ్లి నాలుగు అడుగులు వేస్తే గతంలో లేనిది, మన గ్రామంలోనే ఈరోజు కనిపించేది విలేజ్ సెక్రటేరియట్. ఒక వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. ఎవరు పెట్టారంటే.. మీ జగన్. మన వైఎస్సార్‌ సీపీ పార్టీ. ప్రతి గ్రామ సచివాలయంలో, ప్రతి వార్డు సచివాలయంలో కనీసం అంటే 540 రకాల సేవలు అందిస్తూ, అందులో దాదాపు 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. మరి ఈ వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారంటే.. మీ జగన్. మన వైయస్సార్ సీపీ.

జరిగిన అభివృద్ధిని కళ్లారా చూస్తూ.. 
‘‘మనకు ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించేందుకు ఈరోజు ఈ గోదారమ్మ సీమలో నిలబడి ఉన్నా. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో తెచ్చిన మార్పు. లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్ అని ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి అన్ని అంశాలనూ పంచుకొనేందుకు తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. 

►ప్రతీ నెలా 1వ తేదీ ఉదయాన్నే మన ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి ప్రతి అవ్వాతాతకు మంచి మనవడిలా, మనవరాలిలా, ప్రతి వితంతు, వికలాంగుడికీ ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి చేతిలో పెడుతున్న 3 వేల పెన్షన్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైఎస్సార్ సీపీ. . లంచాలు, వివక్షకు మారుపేరైన జన్మభూమి కమిటీల రోజులు.. ఆరోజుల నుంచి ఈరోజు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తెచ్చారంటే.. మీ జగన్. తెచ్చింది మన వైయస్సార్ సీపీ. డీబీటీ ద్వారా బటన్ నొక్కి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నది ఎవరు అంటే.. మీ జగన్. చేస్తున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం. 

►ఈరోజు ప్రతి గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు-నేడు చేస్తున్నది ఎవరు అంటే.. మీ జగన్. వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లీషు మీడియం, సీబీఎస్ఈతో మొదలు ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గవర్నమెంట్ బడుల్లో పిల్లలకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు కనిపిస్తున్నాయంటే, ఈరోజు డిజిటల్ బోధనతో, క్లాస్ రూముల్లో  ఐఎఫ్‌పీలు కనిపిస్తున్నాయంటే, బడులకు వెళ్లినప్పుడు, పిల్లల్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. చేసినది మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనే. 

►రాష్ట్రంలో రైతన్నను చేయిపట్టుకొని నడిపించే ఆర్బీకేను తీసుకొచ్చింది ఎవరు అంటే మీ జగన్. రైతన్నకు రైతు భరోసా సొమ్ము అందిస్తున్నది ఎవరంటే మీ జగన్. చేస్తున్నది, ఎప్పటి నుంచి మొదలైంది అంటే మన వైయస్సార్ సీపీ వచ్చిన తర్వాతే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద 22ఏ భూముల మీద 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.  నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లోనే అందించిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం చూపనంతగా ఈ పేద వర్గాల సంక్షేమం, అభివృద్ధి పట్ల, మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ప్రేమ, అభిమానం, కమిట్ మెంట్ చూపింది ఎవరంటే మీ జగన్. జరిగింది మంచి ఎప్పుడంటే.. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

►నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది ఎవరు అంటే మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.  కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు నానానానా అంటూ నేను పిలుచుకొనే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ పిలుచుకొనే నా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కింది మీ బిడ్డ పాలనలో.  నలుగురు డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి నానానా అని పిలుచుకుంటూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నది ఎప్పుడంటే మీ బిడ్డ పాలన వచ్చిన తర్వాతే. 

►ఈ ప్రేమ ఉంది కాబట్టే.. రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడనంత వరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇందులో 80 శాతం నానానానా అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారంటే ఇది జరిగింది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, వైయస్సార్ సీపీ పాలన వచ్చిన తర్వాతే.  అక్కచెల్లెమ్మలకు లక్షాధికారిని చేయాలి, గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నది ఎవరంటే మీ జగన్. మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

►నా అక్కచెల్లెమ్మలను ప్రతి రంగంలో ముందడుగు వేయాలని, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి ఇస్తున్నది ఎవరంటే మీ జగన్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే.  అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు అమ్మ ఒడి, పిల్లలకు తోడుగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. ఓ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, మహిళా సాధికారత, దిశ యాప్ అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. జరిగింది ఎప్పుడంటే మన వైయస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. 

►ఆ గ్రామానికి ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడంటే కారణం, ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ,వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉందంటే కారణం.. మీ బిడ్డ. జరుగుతున్నది మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.  108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్ష్ మెంట్ తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది, కదులుతున్నది, అమలు జరుగుతున్నది మీ బిడ్డ హయాంలో, వైయస్సార్ సీపీ పాలనలో. 

►కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. 4 సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్నవి విస్తరణ జరుగుతోంది. పారిశ్రామిక కారిడార్లు ఉరుకులు పరుగులు చేస్తున్నాయి. పారిశ్రామిక వ్యక్తులు, సంస్థలు లైను కడుతున్నాయి. జరుగుతున్నది మీ బిడ్డ పాలనలో, మన వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.  నేను చెప్పిన ప్రతి విషయం వాస్తవం అవునా కాదా అని ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికీ వాస్తవాలను తీసుకొని పోవాలి.  2019లో మనం అధికారంలోకి రాక ముందు ఏ ప్రభుత్వం అయినా ఇది సాధ్యపడుతుందా? అసాధ్యం అనుకున్న పనులన్నీ సాధ్యం చేయగలిగాం.  ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయినీ కూడా ఎలాంటి లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా నేరుగా పేదలకు వారి చేతికి అందించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే.. కాదు.. అది సాధ్యమే ఒక్క జగనన్న పాలనలో అది సాధ్యమే అని దేశానికే చూపించగలిగాం. 

►ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చి మనందరి ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి మంచి మీద, అభివృద్ధి మీద, పేద వాడి భవిష్యత్ మీద, పేదవాడి సంక్షేమం మీద గ్రామ గ్రామం అభివృద్ధి మీద, సామాజిక వర్గాల అభివృద్ధి మీద వారు దాడి చేస్తున్నారు. ఈరోజు మన పెత్తందార్లంతా కూడా ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచన చేయాలి.  మన ప్రభుత్వం అమలు చేస్తున్న రాబోయే తరం విద్యా విధానం మీద వీరి దాడి. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడునేడుతో మారుస్తున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది.  చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి, చెండాటానికి మళ్లీ మన వైయస్సార్ సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, మన లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా మరొక్కసారి అడుగుతున్న సిద్ధమేనా?.. అని పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగం కొనసాగించారు.

Advertisement
Advertisement