విజయవాడలో వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరంపై టీడీపీ మూకలతో దాడి చేసి టెంట్లు పీకేయిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమ.. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై టీడీపీ జెండాతో దాడి చేస్తున్న మూక
శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు ఆటవిక చర్యలు
మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు
ఫీజులు, వసతి దీవెన బకాయిలు, నిరుద్యోగ భృతి తక్షణమే చెల్లించాలి
మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ చేయాలి.. విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి
వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఆందోళనకు డీఎస్సీ బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్‌జీ మద్దతు.. ఉద్యమం ఉధృతం
తన కుమారుడి రాజకీయ భవితపై కలవరంతో టీడీపీ శ్రేణులు, పోలీసులను ఉసిగొల్పిన చంద్రబాబు
బాబును కలిసిన మరునాడే విజయవాడలో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ
విజయవాడలో మల్లాది విష్ణు నిరసన శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. బాటిల్‌లో తెచ్చిన మూత్రం పోసి రెచ్చిపోయిన పచ్చమూక
దీక్షా శిబిరం టెంట్లు లాగేసి రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి.. గూండాగిరిపై చోద్యం చూసిన బెజవాడ పోలీసులు
రాష్ట్ర వ్యాప్తంగా ఖాకీల అండతో రిలే దీక్షలపై రౌడీమూకల దాడులు
సాక్షి, అమరావతి, సాక్షి, నెట్‌వర్క్: ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అయింది.. అధికార మదంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు... ఉన్మాదంతో నీచాతి నీచానికి ఒడిగట్టారు... మునుపెన్నడూ లేనివిధంగా నిరసన శిబిరాలపై పాశవిక దాడులకు తెగబడి, దారుణ ఘటనకు పురిగొల్పి విష సంస్కృతికి తెర తీశారు. మహాత్ముడు జన్మించిన దేశంలో నిరసన తెలియ చేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును కిరాతకంగా కాలరాశారు. నిరసన శిబిరాలపై దాడులకు తెగబడి దౌర్జన్యం చేయడం.. విజయవాడలో ఏకంగా బాటిల్‌లో మూత్రం తీసుకొచ్చి పైశాచికంగా శిబిరంలో ఉన్నవారిపై చల్లడం.. నడిరోడ్డుపై రౌడీయిజానికి దిగడం.. కానీ దెబ్బలు తిన్నవారిపైనే పోలీసులు తిరిగి కేసులు పెట్టడం.. నిజంగా ఇది రాష్ట్ర చరిత్రలో బ్లాక్ డే! ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయడం.. యువతకు రెండేళ్లుగా ఎగ్గొడుతున్న నిరుద్యోగ భృతి చెల్లించడం.. మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై సీబీఐతో విచారణ.. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన శాంతియుత ఆందోళనలపై చంద్రబాబు సర్కారు దమనకాండకు పాల్పడింది.
మెగా డీఎస్సీ పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అర్హులను వెనక్కి నెట్టి పోస్టులను అమ్ముకోవటాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వతేదీ నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జెన్‌జీ యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఉద్యమిస్తోంది. దగా పడిన డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ యువజన–విద్యార్థి విభాగాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుండటంతో తన కుమారుడి రాజకీయ భవిత అంధకారంలో పడుతుందని బెంబేలెత్తిన సీఎం చంద్రబాబు టీడీపీ శ్రేణులు, పోలీసులను రంగంలోకి దించారు. ఖాకీల అండతో పచ్చమూకలు విచ్చలవిడిగా వ్యవహరించాయి. పలు ప్రాంతాల్లో నేరుగా శిబిరాల వద్దకు చేరుకుని వీరంగం సృష్టించాయి. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులో నిమగ్నమైన పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను చంద్రబాబు సర్కారు కాలరాయడంపై యువత మండిపడుతోంది. వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలను భగ్నం చేసేందుకు యత్నించడంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 
దీక్షా శిబిరం వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు పీకేస్తున్న టీడీపీ మూకలు
బ్రాహ్మణనేత మల్లాది శిబిరంపై కోడిగుడ్లు విసిరి.. మూత్రం పోసి!
బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడలో పాల్గొన్న నిరసన దీక్ష శిబిరంపై కోడిగుడ్లు, రాళ్లు, టమాటాలు విసిరిన పచ్చమూక అంతటితో ఆగకుండా అత్యంత దారుణంగా మూత్రం పోసి రెచ్చిపోయాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు స్వయంగా దీన్ని పర్యవేక్షించడం గమనార్హం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో రిలే దీక్షా శిబిరం ఏర్పాటైంది. గురువారం ఉదయం 10 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ తన అనుచరులతో కలసి దుర్భాషలకు దిగారు. టెంట్ వేసి ధర్నాలు చేయడం ఏమిటి..? లోకేశ్, చంద్రబాబును తిడితే తోలు తీస్తామంటూ ఎమ్మెల్యే బొండా టెంట్ పీకేయడంతో ఆయన వెంట వచ్చిన అనుచరులు మరింత చెలరేగిపోయారు. రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో శిబిరంలో ఉన్నవారిపై దాడి చేశారు. ముందుగానే బాటిల్‌లో తెచ్చుకున్న మూత్రాన్ని శిబిరంలో ఉన్నవారిపై చల్లి భీతావహ పరిస్థితి సృష్టించారు. మహిళా కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఇంత జరుగుతున్నా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే గానీ టీడీపీ మూకలను నిలువరించే యత్నం చేయలేదు. ఓ మహిళా కార్యకర్త టీడీపీ జెండా కర్రతో మల్లాది విష్ణు చేతిపై దాడి చేసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి ధర్నా చౌక్‌కు తరలించడంతో అందులో కూర్చునే సాయంత్రం వరకు నిరసన తెలిపారు.
టీడీపీ మూకల దాడిపై వైఎస్సార్‌సీపీ నిరసన..
టీడీపీ మూకల దాడిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, ఎండీ రుహుల్లా, నగర మాజీ డిప్యూటీ మేయర్ అవుతూ శైలజ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్ తదితరులు విజయవాడ ధర్నా చౌక్‌లో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. శాంతియుత ఆందోళనకు ముందుగానే పోలీసుల అనుమతి తీసుకున్నామని, అయినప్పటికీ టీడీపీ మూకల నుంచి భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ శ్రేణులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాబును కలిసిన మర్నాడే బొండా బరి తెగింపు..
సీఎం చంద్రబాబు వద్దకు తన కుమారులను వెంటబెట్టుకుని వెళ్లిన మరుసటి రోజే ఎమ్మెల్యే బొండా ఉమ ఈ దమనకాండకు తెగబడటం గమనార్హం. తన కుమారుడు లోకేశ్ రాజకీయ జీవితాన్ని రక్షించుకునేందుకే బొండాను ఉసిగొల్పినట్లు స్పష్టమవుతోంది. పలు సందర్భాల్లో కాపు నేతలనే చంద్రబాబు పావులుగా వాడుకుంటున్నారు. గతంలో గుడివాడ, మాచర్ల ఘటనల్లోనూ బొండా ఉమను పంపి దాడులకు పురిగొల్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్‌పై నమోదైన కేసులన్నీ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల పరిధిలోనే ఉండటం గమనార్హం. చంద్రబాబు తన రాజకీయ కుతంత్రంతో కాపు యువతను వాడుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
⇒ గుంటూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, తాడిపత్రి, బాపట్ల తదితర ప్రాంతాల్లో దీక్షా శిబిరాలను పోలీసులు బలవంతంగా తొలగించారు. వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించి దీక్షలను అడ్డుకునే యత్నం చేశారు. మాచర్ల, గురజాలలో పోలీసుల ఓవరాక్షన్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. మాచర్లలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్న నిరసన దీక్ష టెంట్ వద్దకు చేరుకున్న పోలీసులు బెదిరింపులకు దిగారు. దీక్షలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించగా.. అక్రమ కేసులకు భయపడేది లేదని పిన్నెల్లి తేల్చి చెప్పారు. 
అన్నమయ్య జిల్లా పుంగనూరులో రిలే దీక్షల్లో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
⇒ రేపల్లె, పలమనేరు, చిలకలూరిపేట, వేమూరు, పొన్నూరులో రిలే దీక్షలను పోలీసులు అడ్డుకున్నారు. దీక్షా శిబిరాలను తొలగించే యత్నాలను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు నిరోధించడంతో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. మార్కాపురం జిల్లా కనిగిరిలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఉదయాన్నే కూల్చి వేశారు. కనిగిరి ఇంఛార్జ్ నారాయణయాదవ్‌ను పోలీసులు ఈడ్చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో దీక్ష టెంట్‌ను టీడీపీ నేతలు దౌర్జన్యంగా తొలగించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటివద్దే పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిర్వహించిన రిలే దీక్షలను దర్గామిట్ట పోలీసులు అడ్డుకున్నారు.
24 గంటల్లోగా బొండా ఉమాను అరెస్టు చేయాలి
లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉ«ధృతం చేస్తాం: మల్లాది విష్ణు
టీడీపీ జెండాతో వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు, తదితరులపై దాడి చేస్తున్న టీడీపీ గూండాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గాంధీనగర్: పోలీసులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా మారారు. వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షకు అనుమతి ఉందా? లేదా? అనే విషయంలో ఎమ్మెల్యేకి ఏం సంబంధం? శిబిరం గురించి మేం పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఎమ్మెల్యే మాపై దాడికి వస్తున్నట్లు ఒక గంట ముందే పోలీసులకు సమాచారం ఇచ్చాం. ఈ విషయం సీఐ సహా పై అధికారులందరికీ చెప్పాం. ధర్నా చేస్తుంటే టెంట్ పీకాల్సిన అవసరం ఏమిటి? రాళ్లు, కోడిగుడ్లు, టమోటాలు వేశారు. మహిళలపై దాడి చేశారు. ఇది మంచి ప్రభుత్వమా? ప్రతిపక్షం ఏమీ మాట్లాడకూడదు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు.. ఏదైనా మాట్లాడితే తోలు తీస్తాం అంటూ బెదిరింపులు! ఇలాంటి రౌడీయిజం, గుండాయిజాన్ని సహించేది లేదు. మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందే. అంతవరకు మా పోరాటం ఆగదు.
సీఎంవో డైరెక్షన్‌లో..
ఎమ్మెల్యే బొండా ఉమా తన అనుచరులు, రౌడీ మూకలతో వచ్చి దాడికి తెగబడ్డారు. దాదాపు రెండు గంటల పాటు వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరం వద్ద బీభత్సం సృష్టించారు. టీడీపీ కార్యకర్తలు కోడిగుడ్లు, టమోటాలు, కుళ్లు పట్టిన పదార్థాల్లో మూత్రం పోసి వైఎస్సార్ సీపీ నాయకులు, మహిళలపై విసిరి రాక్షసానందం పొందారు. దాడి చేస్తున్న బొండా ఉమా రౌడీ మూకలను పోలీసులు అడ్డుకోకుండా, మౌనంగా దీక్ష చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి తరలించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే నేరుగా డైరెక్షన్ రావడం వల్లే పోలీసులు దాడిని అడ్డుకోలేదు. 
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో యమధర్మరాజు స్కిట్ రూపంలో వినూత్నంగా రిలే నిరాహార దీక్ష.. సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్
ఈ దాడి ఘటనపై హోంమంత్రి, డీజీపీ ఏం సమాధానం చెబుతారు? డీఎస్సీలో అక్రమాలు, అభ్యర్థులకు జరిగిన అన్యాయానికి పూర్తి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి. శాంతియుత దీక్షపై భౌతిక దాడులకు పాల్పడిన ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై 24 గంటల్లోగా పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను మరింత ఉ«ధృతం చేస్తాం. కాగా, శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై దాడి చేసి గాయపర్చిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు గుండె సుందర్‌పాల్, వరలక్ష్మీ, మాన్యం జగదీష్ ఎస్‌ఎన్ పురం పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు.


