చంద్రబాబు సర్కారు డైవర్షన్ కుట్ర రెండేళ్లలోనే ప్రభుత్వంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత
హామీల అమలుకు ఉద్యమాల బాట పట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్
రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు 27 నెలలు గడువు
అయినా ఆగష్టు నెలాఖరులోగా సర్దుబాటు అంటూ హడావుడి
ఈ ప్రక్రియను అడ్డు పెట్టుకుని బదిలీలు, పదోన్నతులకు బ్రేక్
ప్రభుత్వ తీరుపై హైకోర్టును ఆశ్రయించిన సుమారు 300 మంది పోలీసులు
‘‘డీఏ బకాయిలు చెల్లించలేదు.. ఐఆర్ ప్రకటించలేదు.. పీఆర్సీ ఇవ్వలేదు.. వీటన్నింటితోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు.. వెరసి చంద్రబాబు ప్రభుత్వంపై రెండేళ్లకే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఉద్యోగులు ఉద్యమ బాట పడుతుండటంతో వారిని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా రాçష్టపతి ఉత్తర్వుల (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమలును తెరమీదకు తెచ్చింది.’’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చంద్రబాబు రెడ్‌బుక్ అమలు భారాన్ని భుజానికి ఎత్తుకుని ఊడిగం చేస్తున్న పోలీసులకే కీలెరిగి వాత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నింది. రక్షక భటుల నెత్తిన సర్దుబాటు పిడుగువేసింది. హామీల అమలు, వేతనాల పెంపు, డీఏ బకాయిలు, పీఆర్సీ వంటి అనేక కీలక అంశాలపై తోటివారితో కలిసి ఖాకీలు నోరెత్తకుండా ఉండేందుకే చంద్రబాబు సర్కారు ఆగమేఘాలపై ఉద్యోగుల విభజన ప్రక్రియ కిటుకును వాడుకుంటోంది.
ప్రభుత్వ తీరు వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఇప్పటికే ఏపీ పోలీస్, అగ్నిమాపక శాఖలకు చెందిన సుమారు 300 మంది పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సమయం, సందర్భం లేకుండా సరైన మార్గదర్శకాలు లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన ప్రక్రియపై రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులూ తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఉపాధ్యాయులతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
27 నెలలు గడువున్నా.. ఇప్పుడెందుకు హడావుడి..
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల విభజన(సర్దుబాటు) ప్రక్రియకు రాష్ట్రపతి ఉత్తర్వులు(ప్రెసిడెన్షియల్ ఆర్డర్)–2025 అమలుకు కేంద్ర ప్రభుత్వం 27 నెలల గడువు ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ నెలాఖరులోపు ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని మెడమీద కత్తిపెట్టి మరీ ఉద్యోగులను మానసిక వత్తిడికి గురిచేస్తోంది. తగిన సమయం ఇవ్వకుండా, సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన ఉద్యోగుల విభజన తీవ్ర గందరగోళంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి, 1975 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్ ఆర్డర్–1975) ముఖ్య ఉద్దేశం ‘స్థానిక అభ్యర్థుల సొంత ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను, ఉద్యోగ రక్షణను కల్పించడం’. ఆర్టికల్ 371–డీ కింద ఇచ్చే రాష్ట్రపతి ఉత్తర్వులకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది.
ఉద్యోగుల విభజన పేరుతో అన్యాయం..
వాస్తవానికి రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుకు సంబంధించి పదోన్నతులను పూర్తిగా నిలిపివేయాలని ఎక్కడా నిబంధనలేదు. అయినప్పటికీ ఉద్యోగుల విభజన సాకుతో జూలై 13 నుంచి సాధారణ బదిలీలు, పదోన్నతులను, జాబ్ క్యాలెండర్‌ను నిలిపివేయడం చట్ట విరుద్ధం. అనేక శాఖల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పదోన్నతులు, కేడర్, సీనియారిటీ వంటి సమస్యలు పరిష్కారం కాకుండానే ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల ఉద్యోగుల సేవా హక్కులు దెబ్బతింటాయి. ఉద్యోగ నియామకాలపై బ్యాన్ పేరుతో కారుణ్య నియామకాలనూ నిలిపివేయడం బాధాకరం. కారుణ్య నియామకం అనేది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ చర్య అనే బాధ్యతను విస్మరించడం దారుణం.
ఉద్యోగుల విభజనలో డిమాండ్లు ఇవి..
ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన ఉద్యోగుల విభజనపై ఉద్యోగ వర్గాల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఉద్యోగుల అభిప్రాయాలను ముందుగా సేకరించాలి. పారదర్శక కేటాయింపు విధానాన్ని అమలు చేయాలి. సీనియారిటీని పూర్తిగా రక్షించాలి. కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలి. తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాతే పూర్తి స్థాయిలో కార్యాలయాలను ప్రారంభించాలి. ఉద్యోగులకు బదిలీ భత్యం, గృహ వసతి సహాయం అందించాలి. ఉద్యోగుల సంఘాలతో నిరంతరం చర్చలు జరపాలి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిపాలనను సులభతరం చేయాలి.
హడావుడిగా సర్దుబాటుతో ఉద్యోగుల హక్కులకు భంగం..
ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు మల్టీజోన్‌లు, జోన్‌లు, జిల్లాల వారీగా ఉద్యోగుల కేటాయింపును హడావుడిగా చేపట్టడంతో తమ హక్కులకు భంగం కలుగుతోందని ఉద్యోగులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావిడిగా ప్రభుత్వం ముందుకు వెళితే వేలాది మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతోపాటు న్యాయపరమైన సమస్యలు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
బలవంతపు బదిలీలు, సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి, కార్యాలయ మౌలిక సదుపాయాల కొరత, పరిపాలనా అయోమయం, సిబ్బంది కొరత, న్యాయపరమైన వివాదాలు, స్థానికత సమస్య, మహిళా ఉద్యోగుల ఇబ్బందులు, వైద్యం, విద్య సౌకర్యాల ఇబ్బందులు వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాష్ట్రంలోని రెవెన్యూ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, మున్సిపల్, విద్య శాఖల్లో ఉద్యోగుల విభజన చిక్కులు ఎక్కువగా ఉన్నాయి.
ఎక్సైజ్ శాఖలో సీనియర్లలో పురుషులు, జూనియర్‌లలో మహిళలు అధికంగా ఉన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వారిని విభజిస్తే కొత్త జిల్లాలకు అత్యధికంగా మహిళా కానిస్టేబుళ్లను కేటాయించడం వల్ల క్షేత్రస్థాయిలో నేరాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఉద్యోగుల హక్కులను కాపాడుతూ.. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచే విధంగా వారి విభజన చేపట్టాల్సిన అవసరం ఉంది.


