కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం తర్జనభర్జన
మెగా డీఎస్సీపై ఉద్యమాన్ని నీరుగార్చాలని మంత్రులకు నిర్దేశం
సాక్షి, అమరావతి : మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనపై గురువారం రాష్ట్ర మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది. అజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ప్రత్యేక సమావేశంలో జగన్ పర్యటనలు, డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆందోళనలపై చంద్రబాబు చాలాసేపు మాట్లాడారు. వైఎస్ జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న స్పందనపై చంద్రబాబు చర్చించారు. ఆ పర్యటనలను తప్పుబడుతూ మాట్లాడాలని, అక్కడ జరిగిన విషయాలను ప్రజలకు వ్యతిరేకంగా చూపాలని ఆదేశించినట్లు తెలిసింది.
ఉద్యమంపై బురద చల్లండి..!
తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన అంచనాలకు అందని రీతిలో విజయవంతం కావడం, జనవాహిని పోటెత్తడంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఆ పర్యటలను నీరుగార్చేలా ప్రచారాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఉద్యమంపై మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇది ఇంకా తీవ్రమైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతుందని పేర్కొన్నట్లు తెలిసింది. యువతలో దీనిపై చర్చ జరుగుతోందని, ఇది జెన్‌జీని తీవ్ర స్థాయిలో ప్రభావితం చేస్తుందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆ ఉద్యమంపై బురద జల్లాలని చంద్రబాబు మంత్రులకు సూచించనట్లు తెలిసింది. ఆ ఉద్యమంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు ఉన్నాయని ప్రచారం చేయాలని చెప్పినట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ నేతలకు రిజర్వేషన్ల గురించి తెలియదని చెప్పాలని ఆదేశించినట్లు తెలిసింది.
మరోసారి పవన్ డుమ్మా
మంత్రివర్గ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి డుమ్మా కొట్టారు. గత మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. వరుసగా రెండు మంత్రివర్గ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడం కూటమిలో చర్చనీయాంశంగా మారింది. భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో ఆయన సమావేశంలో పాల్గొనలేదని టీడీపీ సర్దిచెప్పుకుంటున్నా పవన్ కావాలనే రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రివర్గ సమావేశాలకు దూరంగా ఉంటూ తన శాఖకు సంబంధించిన అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షలు నిర్వహిస్తుండడం విశేషం.


