
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణభవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.
ఇక, అంతకుముందు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్‌ఎస్‌పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్‌కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్‌కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.