
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందన్నారు. ఇదే సమయంలో అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్స్ చేశారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ఫ్యూచర్ లేని సిటీ ఫ్యూచర్ సిటీ. హైదరాబాద్ మెట్రో వెనుక మతలబు ఉంది. వేయి కోట్ల రూపాయలు చేతులు మారాయి. 15వేల కోట్ల భారం తెలంగాణ ప్రజలపై మోపారు. ఉన్న ఆర్టీసీనే నడపలేక పోతున్నారు. ఓ పథకం ప్రకారం ఎల్ అండ్ టీపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చారు. వేయి కోట్ల లాభం ముఖ్యమంత్రి పొందారు. హైదరాబాద్ మెట్రో ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. 35వేల కోట్ల రూపాయల ఆస్తులను ఆదాని, మెగాకి కట్టబెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
మరో వేయి కోట్ల కోసం ప్రణాళిక రచిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ ఆయనకే తెలియదు. అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైలులో వెళ్తారా?. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. కాంగ్రెస్ వచ్చాక ఒక్క తట్టెడు మట్టి కూడా వేయలేదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది. ఇల్లు లేని దగ్గర రోడ్లు వేయడం రేవంత్ మూర్ఖత్వమే అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని ప్రజలు నమ్మడం లేదు. ప్రభుత్వంపై విశ్వాసం లేదు. బీసీ ప్రజలను మోసం చేసి తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూస్తున్నారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.