సింగరేణి సెగ ఎవరికి?  | BRS hopes for legacy jobs | Sakshi
Sakshi News home page

సింగరేణి సెగ ఎవరికి? 

Published Fri, Nov 24 2023 4:39 AM | Last Updated on Fri, Nov 24 2023 4:39 AM

BRS hopes for legacy jobs - Sakshi

ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పు ఇచ్చే సింగరేణి ఓటర్లు ఈసారి ఎటువైపు మొగ్గు చూపుతారోనని రాజకీయపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో గోదావరి లోయ పరిధిలో 6 జిల్లాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించిన సింగరేణిలో మొత్తంగా 11 డివిజన్లలో 70వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 42 వేల మంది రెగ్యులర్‌ ఉద్యోగులు కాగా, మరో  28వేల మంది కాంట్రాక్టు కార్మికులు. వీరి కుటుంబసభ్యులతో సహా మూడున్నర లక్షల మంది వరకు ఓటర్లు ఉంటారు.

ఈ 11 నియోజకవర్గాల్లో సింగరేణి ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపుతే ఫలితం అటు వైపే అన్న విషయం గత అనుభవాల నేపథ్యంలో అన్ని పక్షాలకు తెలుసు. దీంతో సింగరేణి కార్మికులను మచ్చిక చేసుకునేందుకు అన్ని పార్టీలు ఇప్పటికే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్నర్‌ మీటింగ్‌లు, దావత్‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి.

ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌  సింగరేణి పరి ధిలోని పలు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాదసభలు నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క వంటి నాయకులు సింగరేణి బెల్ట్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలుగా ఉన్న టీబీజీకేఎస్‌ (బీఆర్‌ఎస్‌), ఐఎన్‌టీయూసీ (కాంగ్రెస్‌), ఏఐటీయూసీ (సీపీఐ)ల బలం కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. 

2018లో విలక్షణ తీర్పు 
గత శాసనసభా ఎన్నికల్లో సింగరేణి ఓటర్లు విలక్షణ తీర్పును ఇచ్చారు. 11 శాసనసభా నియోజకవర్గాలకుగాను టీఆర్‌ఎస్‌కు కేవలం మూడు సీట్లు మాత్రమే కట్టబెట్టారు. బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాలల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలుపొందగా, రామగుండంలో బీఆర్‌ఎస్‌ రెబెల్‌ కోరుకంటి చందర్‌ ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ టికెట్‌ మీద పోటీ చేసి విజయం సాధించారు.

సత్తుపల్లిలో టీడీపీ గెలుపొందగా, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాకల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి కాంగ్రెస్, టీడీపీ నుంచి గెలిచిన వారితో పాటు భూపాలపల్లి , ఆసిఫాబాద్‌ నుంచి గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి , ఆత్రం సక్కు కూడా తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు వారిలో ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆత్రం సక్కు మినహా మిగతా వారంతా బీఆర్‌ఎస్‌ తరపున బరిలో నిలిచారు.

ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి గతంలో ఓడిపోయిన కోవా లక్ష్మికే మరోసారి బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కింది. ఈసారి సింగరేణి కార్మికులు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే మద్దతు పలుకుతారా? కొత్త వారికి అవకాశం కల్పిస్తారా? అనేది చూడాలి. కాగా, మంథని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లోనే బీజేపీ ప్రభావం కనిపిస్తోంది మిగిలిన చోట్ల ఆ పార్టీ పోటీ నామమాత్రంగానే ఉంది.

మిగతా హామీల సంగతేంటంటున్న కాంగ్రెస్, సీపీఐ 
గత సింగరేణి ఎన్నికల్లో వారసత్వ ఉద్యోగాలతో పాటు కార్మికులు రాష్ట్రంలో ఎక్కడైనా సొంతిల్లు నిర్మించుకునేందుకు రూ.10లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయిస్తామని బీఆర్‌ఎస్‌ నేతలు హామీ ఇచ్చా రు.  కార్మికులకు ఆదాయపన్ను మినహాయింపు హామీని కూడా అమలు చేయిస్తామని చెప్పారు.

గనుల్లో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం రూ. 20 లక్షలకు పెంపు హామీ ఇంకా నెరవేరలేదు. భూగర్భ బొగ్గు గనులను ఓపెన్‌ కాస్ట్‌ గనులుగా మార్చడం, కొత్త గనులు తెరవకపోవడం, సింగరేణికి ప్రభుత్వ సంస్థలు రూ. వేల కోట్లు బాకీపడడం, సింగ రేణిలో పెరిగిన రాజకీయ జో క్యం, ప్రైవేటీకరణ వంటి అంశాలను కాంగ్రెస్, సీపీఐ తప్పు పడుతున్నాయి. 

వారసత్వ ఉద్యోగాలపై బీఆర్‌ఎస్‌ ఆశలు  
2017లో జరిగిన సింగరేణి ఎన్నికల్లో తమ కార్మిక సంఘం టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే వారసత్వ ఉద్యోగాల కల్పనతో పాటు పలు హామీలు నెరవేరుస్తామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో గెలిచిన వెంటనే తదనుగుణంగా పావులు కదిపి సింగరేణి కారుణ్య నియామకాల ఉత్తర్వులు తీసుకొచ్చింది. ఈ మేరకు ఇప్పటి వరకు 18వేల మందికి వారసత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు బీఆర్‌ఎస్‌ చెబుతోంది.

ఎప్పుడో చంద్రబాబు హయాంలో 1998లో రద్దయిన వారసత్వ ఉద్యోగాల ప్రక్రియను పునః ప్రారంభించి, సింగరేణి కార్మికుల కలలను నెరవేర్చిన పార్టీ బీఆర్‌ఎస్‌ అని ఆపార్టీ ఎమ్మెల్యేలు చెపుతున్నారు.  సింగరేణి కార్మికులకు ఇచ్చే క్వార్టర్స్‌ విషయంలో నిబంధనల సడలింపు, కాంట్రాక్టు కార్మికులకు మెరుగైన జీతాలు, మరమ్మతుల కల్పన, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పన వంటివి అందించడంతో బీఆర్‌ఎస్‌ పట్ల సానుకూలత ఉందని తెలుస్తోంది.

లాభాల వాటాను 16 శాతం నుంచి 23 శాతానికి పెంచుతామన్న హామీ నెరవేర్చడం, దసరా, దీపావళి  పేరిట కార్మికులకు ఇచ్చే బోనస్, అడ్వాన్స్‌ పెంపు కూడా  తమ విజయంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు పూర్తిస్థాయిలో బీఆర్‌ఎస్‌ వెంట నడుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

-పోలంపల్లి ఆంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement