
బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటం
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేలా సభ
సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉపఎన్నికలు ఖాయం
కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం
ముఖ్య నేతలతో కొనసాగుతున్న కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్‌ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.
– రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్‌లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు.
– సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు.
– స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి.
– స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు.