దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం | Botsa Satyanarayana Fires On Chandrababu TDP | Sakshi
Sakshi News home page

దృష్టి మళ్లించేందుకే దుష్ప్రచారం

Sep 12 2022 4:19 AM | Updated on Sep 12 2022 6:52 AM

Botsa Satyanarayana Fires On Chandrababu TDP - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం జగన్‌ ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించేలా వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకాలను ప్రవేశపెట్టారని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా చంద్రబాబు, ఎల్లో మీడియాతో కూడిన దుష్టచతుష్టయం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌కు దక్కుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పూర్తి న్యాయం చేయాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమన్నారు. కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద చంద్రబాబు చెప్పిన దానికంటే రెండింతలు అధికంగా ఇస్తున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో వివాహ కానుక కింద 18 వేల మందికి రూ.69 కోట్లను ఎగ్గొట్టిన చంద్రబాబు ఇప్పుడు వేదాలు వల్లిస్తుండటం సిగ్గుచేటని బొత్స ధ్వజమెత్తారు.

అక్టోబర్‌ 1 నుంచి కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుండటంతో ప్రజల దృష్టి మరల్చడానికి ‘ఈనాడు’లో ఇసుకపై అసత్య కథనాలను ప్రచురించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.నాలుగు వేల కోట్ల ఆదాయం వస్తోందని, టీడీపీ హయాంలో అదంతా ఆ పార్టీ నేతలు దోచుకుంటే రామోజీరావుకు ఇంపుగా అనిపించిందా? అని ప్రశ్నించారు. ఇసుక సరఫరా కాంట్రాక్టర్‌ నిబంధనల ప్రకారం పని చేయాల్సిందేనని, టీడీపీ హయాంలో మాదిరిగా వారి సామాజిక వర్గంవారో, వారి అనుయాయులే తింటామంటే కుదరదని తేల్చిచెప్పారు.

మూడు రాజధానులకు కట్టుబడ్డాం
అమరావతి నుంచి అరసవల్లికి పాదయాత్ర ఉద్దేశం ఏమిటని మంత్రి బొత్స ప్రశ్నించారు. అమరావతిలాగే విశాఖపట్నం అభివృద్ధి చెందితే చంద్రబాబుకు ఇష్టం లేదా? అని నిలదీశారు. సాధారణ భవనం కట్టినా వందల అడుగులు లోతులో పునాదులు వేయాల్సిన ప్రాంతంలో రాజధానిని చంద్రబాబు ఎంపిక చేశారని చెప్పారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే రూ.లక్షల కోట్లు ఖర్చవుతుందని, అంత వ్యయాన్ని 29 గ్రామాల అభివృద్ధికి వెచ్చించడం భావ్యమా? అని ప్రశ్నించారు.

అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని తాము పక్కదారి పట్టించలేదని స్పష్టం చేశారు. తాము అమరావతికి వ్యతిరేకం కాదని, మూడు రాజధానులకు కట్టుబడ్డామని తేల్చిచెప్పారు. రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాల వారు ఉండాలనే సీఆర్‌డీఏ చట్టంలో మార్పులు చేశామని పునరుద్ఘాటించారు. చంద్రబాబు ఆయన సామాజిక వర్గం బాగుండాలని కోరుకుంటారే కానీ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించరని విమర్శించారు.

రాజధాని పేరుతో రూ.ఆరువేల కోట్లు అప్పులు తెచ్చిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా వ్యతిరేకించడమంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవడమేనని, దీన్ని ఆ ప్రాంత ప్రజలు చూస్తు ఊరుకోరని  అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement