మోదీ పాలనలోనే దేశాభివృద్ధి | Sakshi
Sakshi News home page

మోదీ పాలనలోనే దేశాభివృద్ధి

Published Fri, Feb 23 2024 4:39 AM

BJP Vijaya Sankalpa Yatra in shadnagar - Sakshi

షాద్‌నగర్, కొందుర్గు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ చేరుకుంది. ఈ సందర్భంగా లాల్‌పహాడ్, కొందుర్గు, షాద్‌నగర్‌లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మోదీ నాయకత్వాన్ని మరోసారి బలపర్చాలని కోరారు.

ప్రజా సంక్షేమం, దేశ భద్ర త, అవినీతి రహిత సమాజం ఆయనతోనే సాధ్యమన్నారు. అయోధ్యలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట ఆహ్వానాన్ని తిరస్కరించిన కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు ఓటేయాలో ప్రశ్నించాలని సంజయ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల  ముందు ఆ పార్టీ నేతలు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలవుతున్నా ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం పెద్ద ఎత్తున  నిధులు మంజూరు చేస్తే.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడిందని ధ్వజమెత్తారు. 

రామరాజ్యం కావాలంటే..  
‘బీజేపీకి మోదీ ఉన్నాడు.. ఆయన వెనక శ్రీరాముడు ఉన్నాడు.. కాంగ్రెస్‌కు రాహుల్, కేసీఆర్, ఒవైసీలు ఉన్నారు. దేశంలో రామరాజ్యం కావాలంటే తిరిగి ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలే తేల్చుకోవాలి’అని బండి సంజయ్‌ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మళ్లీ మోదీ ప్రధాని అయితేనే రైతులకు సబ్సిడీలు, పేదలకు ఉచిత బియ్యం వస్తాయని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ ఎంపీలు గెలిస్తేనే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తారని అన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తేనే ఆరు గ్యారంటీలు అమలవుతాయని, అలా కావాలంటే బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకోవాలని చమత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement