
ఏడాదిన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం
నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా
రేపు లేదా 10న బాధ్యతలు స్వీకరిస్తా
‘సాక్షి’తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
అప్పుల గురించి రేవంత్‌కు అప్పుడు తెలియదా?
ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు.
రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు.
ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు..
పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్‌ఎస్‌ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది.
రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం.
ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి..
రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది.
గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్‌ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తాం.
ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్‌కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు.
నిత్యం ప్రజల మధ్యనే ఉంటా..
రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే.
బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి.
ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా.