Bandi Sanjay Padayatra: బండి సంజయ్‌ పాదయాత్రపై సస్పెన్స్‌.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ..

BJP Praja Sangrama Yatra: Excitement On Bandi Sanjay Padayatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌, వరంగల్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. హైకోర్టు నిర్ణయం పై పాదయాత్ర భవితవ్యం ఆధారపడి ఉంది. సంజయ్ అరెస్టు తో రెండు రోజులుగా నిలిచిపోయిన పాదయాత్ర మూడో రోజు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. బీజేపీ శ్రేణులు మాత్రం పాదయాత్ర ముగింపు సభ 27న హన్మకొండ లో నిర్వహిస్తామని చెబుతున్నా అందుకు అనుకూల పరిస్థితులు కానరావడం లేదు. ముంచుకొస్తున్న గడువుతో కమలనాదుల్లో టెన్షన్ నెలకొంది.
చదవండి: పాతబస్తీలో బీజేపీ పాగా వేస్తుందా?.. వ్యూహం ఇదేనా? 

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. నిరసనలు ఆందోళనలు సవాళ్లు ప్రతిసవాళ్లు దాడులు ప్రతి దాడులతో సాగుతున్న పాదయాత్రకు జనగామ జిల్లాలో బ్రేక్ పడింది.‌ ఈనెల 2న యాదాద్రిలో ప్రారంభమైన పాదయాత్ర 27న వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి సన్నిధిలో ముగించాల్సి ఉంది. 19 రోజులు సాగిన పాదయాత్ర జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూరుకు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రవేశించినప్పటి నుంచి పాదయాత్ర అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ శ్రేణులను టెన్షన్‌కు గురిచేసింది.

లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చి పాదయాత్రపై ప్రభావం చూపింది. హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బీజేపి కార్యకర్తలపై దాడి చేయడంతో పాటు అక్రమంగా హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల బండి సంజయ్ ఆగ్రహంతో రాష్ట వ్యాప్తంగా నిరసన ఆందోళనలకు పిలుపునిచ్చి పాదయాత్ర శిబిరం వద్దే ధర్మదీక్షకు సిద్ధమయ్యారు. కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడం తోపాటు లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు చేయడంతో టీఆర్ఎస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమై పాదయాత్రను అడ్డుకునేందుకు సిద్ధమై భారీగా గులాబీ శ్రేణులు తరలిరావడం ఉద్రిక్తతకు దారితీసింది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పోటాపోటీగా బలప్రదర్శనకు సిద్దంకావడంతో  శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందని గమనించి పోలీసులు ముందు జాగ్రత్తగా బండి సంజయ్ ధర్మదీక్షను భగ్నం చేసి అరెస్టు చేసి కరీంనగర్ లోని స్వగృహానికి తరలించారు. పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని నోటీస్ జారీ చేసి పాదయాత్ర అనుమతి రద్దు చేసి స్టేషన్ ఘనపూర్ పీఎస్ లో కేసు నమోదు చేశారు. అక్రమ కేసులు అరెస్టులను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపి శ్రేణులు నిరసన దీక్షలు చేపట్టారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర కొనసాగించి 27న ముగింపు సభ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
పాదయాత్ర కొనసాగిస్తామని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నప్పటికీ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు. పాదయాత్రకు అనుమతించాలన్న బిజేపి హౌస్ మోషన్

పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు, ఈ రోజు లంచ్ మోషన్ పిటిషన్‌ను స్వీకరించి ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఎందుకు పాదయాత్ర ఆపాలో కారణాలు చెప్పాలని విచారణను రేపటికి వాయిదా వేసింది. షరతులతో కూడిన అనుమతి లభిస్తుందని కమల నాథులు భావిస్తుండగా పోలీసులు మాత్రం పాదయాత్ర జరిగితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించే అవకాశాలు ఉన్నాయి.

దీంతో పాదయాత్ర ఉంటుందా? ఉండదా అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాదయాత్ర నిలిచిపోయిన, 27న భారీ బహిరంగ సభ హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. బండి సంజయ్ సైతం పార్టీ శ్రేణులతో సమావేశమై సభ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 27న జరిగే బహిరంగ సభకు బీజేపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరవుతుండడంతో వారి సమక్షంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు ఎర్రబెల్లి ప్రదీప్‌రావుతో పాటు హుస్నాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకులు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బీజేపీలో చేరనున్నారు.

సభకు ఇక రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇప్పటికి ఎలాంటి ఏర్పాట్లు జరగకపోవడం పాదయాత్ర ముగింపు సభపై నీలినీడలు కమ్ముకున్నాయి. పాదయాత్ర బహిరంగ సభ ఉంటుందని బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యాని ప్రదర్శిస్తున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బీజేపీ పాదయాత్రను అడ్డుకోమని టీఆర్ఎస్ నేతలు చెబుతూనే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడికక్కడ నిరసన తెలుపుతామని స్పష్టం చేస్తున్నారు.‌ రెండు అధికార పార్టీలు పోటాపోటీ నిరసనలు ఆందోళనలతో ఓరుగల్లును పోరుగల్లుగా మార్చి పోలీసులను ఇరకాటంలో పడేసే పరిస్థితి ఏర్పడింది. రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం ఎటువైపు దారి తీస్తుందోనని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
చదవండి: స్పీకర్‌కు ఎంఐఎం లేఖ.. రాజాసింగ్‌పై సంచలన కామెంట్స్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top