హైదరాబాద్: దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆస్తులను కాజేయడానికి కుట్ర జరుగుతుందని కేంద్ర మంత్రి ,బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల కన్నుపడిందన్నారు. ఈరోజు(శనివారం, నవంబర్ 8వ తేదీ) జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ గోపీనాథ్ ఆస్తులపై సీఎం, కేటీఆర్ కన్ను. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారుఅందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయకుండా కుట్రలు చేస్తున్నరు.
ఇదిగో కంప్లయింట్ కాపీ... పంపిస్తున్నా. సీఎం.. నీకు రోషముంటే, పౌరుషముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలి. గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారు. వాస్తవాలు చెబుతుంటే... నన్ను మతతత్వవాది అంటున్నరు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ వెనుకాడను.
80 శాతం మంది హిందువులారా...మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ’ అని స్పష్టం చేశారు.


