
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటల రాజేందర్. తాను చేసిన ఆరోపణల్లో రేవంత్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు. అసలు రేవంత్‌తో తనకు పోలికేంటి అని వ్యాఖ్యానించారు.
'ఓటు నోటు కేసులో మీరు జైలుకెళ్లారు.. మీతో నాకు పోలికా? ప్రజల కోసం రేవంత్ ఎప్పుడూ జైలుకెళ్లలేదు. నేను విద్యార్థి దశ నుంచే ఎన్నో పోరాటాలు చేశా. రేవంత్ ప్రమాణం చేస్తే ఎవరూ నమ్మరు.' అని ఈటల ఫైర్ అయ్యారు.
కాగా.. మునుగోడు ఉపఎన్నికలకో కాంగ్రెస్‌కు సీఎం కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈటల నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం సాయంత్రం భాగ్యలక్ష‍్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. అయితే రేవంత్ ఆలయం వద్దకు వెళ్లి ప్రమాణం చేసినా.. ఈటల మాత్రం వెళ్లలేదు.
దీంతో 'గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్ ఆలోచించి మాట్లాడాలి' అని రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఈ వ్యాఖ్యలపైనే స్పందిస్తూ రేవంత్‍పై ఈటల ఫైర్ అయ్యారు.
చదవండి: ఈటల మాటలు.. రేవంత్ ఒట్లు.. ఘాటెక్కిన 'కోట్లా'ట!