అధికార బీఆర్‌ఎస్‌పై అన్నిచోట్లా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి  | Sakshi
Sakshi News home page

అధికార బీఆర్‌ఎస్‌పై అన్నిచోట్లా వ్యతిరేకత: కిషన్‌రెడ్డి 

Published Sat, Oct 28 2023 1:36 AM

BJP Kishan Reddy Comments On BRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/చేవెళ్ల: రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లినా అధికార బీఆర్‌ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందని కేంద్రమంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. సకలజనులు పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ..నేడు అవినీతిపరులు, మాఫియా చేతిలో బందీ అయ్యిందని ఆరోపించారు. కేసీఆర్‌ కుటుంబ, అవినీతి, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు.

ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుందని దీమా వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం, ఆయన అనుచరులు, పలువురు ప్రస్తుత, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు 60 మంది బీజేపీలో చేరారు. వీరిలో చేవెళ్ల, నవాబుపేట, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు, రైతు నాయకులు, దళిత సామాజిక వర్గ యువకులు ఉన్నారు. వారికి కిషన్‌రెడ్డి కండువా కప్పి పారీ్టలోకి ఆహా్వనించారు. తెలంగాణలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దళిత నాయకుల్లో రత్నం ఒకరని పేర్కొన్నారు. 
 

రాహుల్‌ తప్పుడు ప్రచారం 
‘బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనంటూ రాహుల్‌ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలు, ప్రజల ఆకాంక్షలపై ఆయనకు ఎలాంటి అవగాహన లేదు. తెలంగాణ పోరాట చరిత్ర గురించి తెలియని రాజకీయ అజ్ఞాని. ఎవరో రాసిచి్చన స్క్రిప్ట్‌ ఆధారంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ‘బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ బీ–టీమ్‌.అమ్ముడు పోయే పార్టీ కాంగ్రెస్‌.. కొనే పార్టీ బీఆర్‌ఎస్‌. 2018లో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయారు.

వారిలో కొందరిని మంత్రులుగా కొనసాగిస్తున్న దరిద్ర పు పార్టీ బీఆర్‌ఎస్‌. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పంటలకు కనీసం 5 గంటల కరెంట్‌ కూడా ఇవ్వలేకపోతోంది. ఎన్నికల్లో అక్కడ మహిళలు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక నిండా మోసం చేసింది..’అని విమర్శించారు. ‘మేము ప్రజల టీమ్‌ తప్ప.. ఏ పార్టీకి టీమ్‌ కాదు..’అని స్పష్టం చేశారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విఠల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చేవెళ్లకే జీవితం అంకితం: రత్నం 
తనకు రాజకీయ జీవితం అందించిన చేవెళ్ల ప్రజలకు అధికారంతో సంబంధం లేకుండా జీవితాంతం సేవ చేస్తానని కేఎస్‌ రత్నం అన్నారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని తెలిపారు. తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గంలో మండలానికో ఇంటర్నేషనల్‌ స్కూల్, ఆస్పత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయానికి వెళ్లే ముందు స్థానిక లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో రత్నం పూజలు చేశారు.   

Advertisement
Advertisement